శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్: బ్రహ్మోత్సవాల వేళ..
ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. బుధవారం నాడు 75,688 మంది భక్తులు శ్రీవారి దర్శించుకున్నారు. వారిలో 29,099 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్కరోజే హుండీ ద్వారా 4.45 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోయాయి. టోకెన్ లేని సర్వదర్శనం భక్తులకు స్వామివారి దర్శనానికి 15 నుంచి 17 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకులు అన్న ప్రసాదం, అల్పాహారం, పాలు, మంచినీరు పంపిణీ చేశారు.

ఈ ఏడాది సెప్టంబర్ 24న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నయి. ఈ నేపథ్యంలో ఆలయం నాలుగు మాడ వీధుల్లో చేస్తున్న ఏర్పాట్లను టీటీడీ కార్యనిర్వహణాధికారి జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా ఎస్పీ హర్షవర్థన్ రాజు, టీటీడీ సీవీఎస్వో మురళీకృష్టలతో పరిశీలించారు.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఒక నెల ముందుగా నిర్వహించే స్వామివారి పుష్కరిణి మరమ్మతు పనులు పూర్తయి కొత్త హంగులను సంతరించుకుంది. స్వామి పుష్కరిణి బుధవారం నుండి భక్తులకు అందుబాటులోకి వచ్చింది. భక్తులను పుష్కరిణీలో అనుమతించారు.
ఈ మరమ్మతు పనులు కిందటి నెల 20 తేదిన ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా స్వామి పుష్కరిణిలోని పాత నీటిని తొలగించి, నీటి అడుగు భాగంలో పేరుకుపోయిన ఇసుకను, పాచిని తొలగించారు. టీటీడీ వాటర్‌వర్క్స్ విభాగానికి చెందిన దాదాపు 100 మంది కార్మికులు రేయింబవళ్లు కష్టపడి స్వామి పుష్కరిణి శుద్ధి కార్యమ్రాన్ని పూర్తి చేశారు.
అంతేకాకుండా స్వామి పుష్కరిణి మెట్లకు ఆకర్షణీయమైన రంగులు అద్దారు. శోభాయమానంగా తీర్చిదిద్దారు. దాదాపు కోటి లీటర్ల నీటితో స్వామి పుష్కరిణి నింపి మరమ్మతు పనులు పూర్తిచేశారు. మరమ్మతు పనుల నేపథ్యంలో ప్రతిరోజూ నిర్వహించే పుష్కరిణి హారతిని టీటీడీ నిలిపివేసింది. అదే విధంగా భక్తులను కూడా అనుమతించలేదు. నేటి నుండి భక్తులను పుష్కరిణీలో అనుమతించారు.












Click it and Unblock the Notifications