రాజ్యసభలో టర్నింగ్ పాయింట్: కాంగ్రెస్‌కు జెసి ఝలక్
హైదరాబాద్: రాజ్యసభ ఎన్నికల విషయంలో కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది. రెబల్ అభ్యర్థులుగా ఉన్న చైతన్య రాజు, ఆదాల ప్రభాకర్ రెడ్డిల నామినేషన్లను తిరస్కరించాలని కాంగ్రెసు పార్టీ ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కోరిన విషయం తెలిసిందే. రిటర్నింగ్ అధికారి కూడా రెబల్ అభ్యర్థులకు గంట సమయం ఇచ్చారు. అయితే, ఆ తర్వాత మరో ట్విస్ట్ ద్వారా కాంగ్రెసు పార్టీకి షాక్ తగిలింది.
చైతన్య రాజు, ఆదాలల నామినేషన్‌లను రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. కాంగ్రెసు పార్టీ వారికి వ్యతిరేకంగా సరైన ఆధారాలు చూపించనందున తిరస్కరించేందుకు అంగీకరించలేదు. నిబంధనల ప్రకారం నామినేషన్లను అభ్యర్థులే ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి చెప్పారు. మద్దతు చూపించనంత మాత్రాన నామినేషన్లను తిరస్కరించాలనే నిబంధన లేదన్నారు.

ఈ సందర్భంగా జెసి దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము పార్టీలకతీతంగా వారిద్దరని రాజ్యసభ బరిలో నిలిపామని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలను మంత్రులు తమ కార్యాలయాల్లోనే నిర్బంధించినా తమకు న్యాయం జరిగిందన్నారు. సమైక్యవాదం వినిపించేందుకే తాము బరిలో నిలిచామన్నారు. ఆఖరుకు తాము ఒకే అభ్యర్థిని బరిలో ఉంచే విషయమై ఆలోచిస్తామన్నారు.
తమకు న్యాయం జరిగిందని చెప్పారు. పార్టీలకతీతంగా సమైక్యవాదం వినిపించాలనుకునే వారు తమకు మద్దతు ఇవ్వాలన్నారు. కాంగ్రెసు పార్టీ కుయుక్తులు పన్నినా తమకు ఎన్నికల సంఘం న్యాయం చేసిందని చెప్పారు. కాగా, ఓ వైపు కాంగ్రెసు నేతలు చైతన్య రాజు, ఆదాలలకు మద్దతు ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యేల పైన ఒత్తిడి తెచ్చినా జెసి దివాకర్ రెడ్డి రెబల్ వర్గానికి అండగా నిలిచారు.












Click it and Unblock the Notifications