ఏపీ, తెలంగాణలో అత్యంత ధనవంతురాలు ఆమే
ఈనెల 18వ తేదీ నుంచి ఏపీలో నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. మంచి ముహూర్తాలు చూసుకొని అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. వారి ఆస్తులు, అప్పుల వివరాలు కూడా తెలియజేస్తున్నారు. అందరూ శ్రీమంతులే ఉన్నారు. అయితే వీరిలో మొదటి స్థానంలో ఎవరున్నారు? చివరి స్థానంలో ఎవరున్నారు? అనేదానిపై చర్చ నడుస్తోంది. ఆస్తులు మాత్రం ఒకరిని మించి మరొకరికి ఉన్నాయి. వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.
కోవూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇప్పటివరకు నమోదైన నామినేషన్లలో అత్యంత సంపన్న అభ్యర్థిగా నిలిచారు. వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ప్రభాకర్ రెడ్డి దంపతుల ఉమ్మడి ఆస్తుల విలువ రూ.715.62 కోట్లుగా ఉంది. ప్రశాంతి రెడ్డి పేరుతో రూ.76.35 కోట్లు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేరుతో రూ.639.26 కోట్ల ఆస్తులు, రూ.197.29కోట్ల అప్పులున్నాయి. రూ.6.96 కోట్ల విలువైన 19 కార్లు ఉన్నాయి.

వీరి తర్వాత వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక నిలిచారు. ఆమె తన ఆస్తులను రూ.161.21 కోట్లుగా చూపించారు. అప్పులు కూడా రూ.7.82 కోట్లుగా ఉన్నాయి. శ్రీశైలం వైసీపీ అభ్యర్థి శిల్పా చక్రపాణి రెడ్డి కుటుంబం ఆస్తులు విలువ రూ.131.71 కోట్లుగా ఉంది. అప్పులు రూ.28.24 కోట్లు ఉన్నాయి. 2014లో రూ.48.89 కోట్ల ఆస్తులను చూపగా.. 10 సంవత్సరాల్లో వాటి విలువ భారీగా పెరిగింది. 2019 ఎన్నికల్లో కూడా 37 కోట్ల రూపాయలుగానే చూపించారు. ఈ ఐదు సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు రూ.100 కోట్లకు పెరిగింది.

అలాగే హిందూపురం నుంచి పోటీపడుతున్న నందమూరి బాలకృష్ణ తన ఆస్తులు విలువ రూ.81.63కోట్లుగా చూపించారు. అప్పులు రూ.9 కోట్లుగా ఉన్నాయి. భార్య వసుంధర ఆస్తుల విలువ రూ.140 కోట్లుగా ఉంది. మూడుకోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఎన్నికల అఫిడవిట్ల పుణ్యమా అని రాజకీయ నేతల ఆస్తుల వివరాలన్నీ నెమ్మదిగా బయటకు వస్తున్నాయి.













Click it and Unblock the Notifications