టిడిపిలో ముసలం: 'కౌన్ కిస్కా' పయ్యావులపై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ అంశంపై తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పార్టీ సీమాంధ్ర నాయకుడు పయ్యావుల కేశవ్‌కు, పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు మధ్య వైరం ముదిరి పాకాన పడింది. పయ్యావుల కేశవ్‌ను ఎర్రబెల్లి దయాకర్ రావు కౌన్ కిస్కా అంటూ వ్యాఖ్యానించారు. పార్టీ సీమాంధ్ర నాయకులు కోడెల శివప్రసాదరావు, పయ్యావుల కేశవ్‌లను ఆయన పార్టీలో చీడపురుగులుగా అభివర్ణించారు.
తాను పార్టీని వీడబోనని, పార్టీలోని చీడపురుగులను వెళ్లగొడుతామని ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. పార్టీ విధానాన్ని మారుస్తానని చెప్పడానికి పయ్యావుల కేశవ్ ఎవరు.. కౌన్ కిస్తా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పార్టీలో పయ్యావుల కేశవ్, కోడెల శివప్రసాద రావు చిచ్చు పెడుతున్నారని ఆయన విమర్సించారు.

సమైక్యవాది అయిన తమ పార్టీ సీమాంధ్ర నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ వైఖరికి అనుగుణంగా మాట్లాడుతుంటే పయ్యావుల కేశవ్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. మొదట సమైక్యాంధ్ర గురించి మాట్లాడిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు ఇప్పుడు ప్యాకేజీల గురించి మాట్లాడడం లేదా అని ఆయన ప్రశ్నించారు. అలాగే తమ పార్టీ సీమాంధ్ర నాయకులు వ్యవహరించాలని ఆయన అన్నారు.
దమ్ముంటే పయ్యావుల కేశవ్ తెలంగాణపై పార్టీ విధానాన్ని మార్చాలని ఆయన సవాల్ విసిరారు. తమ పార్టీ తెలంగాణకు కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు రాసిన లేఖలో సమస్యలను పరిష్కరించాలని మాత్రమే చెప్పారని ఆయన గుర్తు చేశారు. సీమాంధ్ర జెఎసిలను చర్చలకు పిలిస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అన్నారు.
తమ పార్టీది సమైక్యవాదమనే వాదనలో నిజం లేదని ఆయన అన్నారు. తెలంగాణపై తమ పార్టీ వెనక్కి తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. సమన్యాయం చేయాలన్నదే తమ డిమాండ్ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications