మెగా బ్రదర్స్ పై రోజా షాకింగ్ కామెంట్స్-ఇదే తొలిసారి-అధిష్టానం సూచనతోనేనా ?
ఏపీలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై నిత్యం ఏదో ఒక విమర్శ చేస్తూ ఉండే మంత్రి ఆర్కే రోజా ఇవాళ ఆయనతో పాటు మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబును కూడా కలిపి టార్గెట్ చేశారు. ఈ ముగ్గురిపై మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురి రాజకీయ ప్రస్ధానం, భవిష్యత్తుపై మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. విపక్ష నేత చంద్రబాబు కుప్పం టూర్ ను వీరికి లింక్ చేస్తూ రోజా చేసిన వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది.

మెగా బ్రదర్స్ పై రోజా కామెంట్స్
మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో చంద్రబాబు టూర్ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలతో మొదలుపెట్టి, వాటిని పవన్ కు లింక్ చేసి, అనంతరం చిరు, నాగబాబును కూడా ఇందులోకి లాగి రోజా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా చంద్రబాబుకు పవన్ ఇస్తున్న మద్దతును రోజా టార్గెట్ చేశారు. దీంతో రోజా వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ తో పాటు జనసైనికులు మండిపడుతున్నారు.

పవన్ మూతికి ప్లాస్టర్
చంద్రబాబు తప్పులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ మూతికి ప్లాస్టర్ వేసుకుంటాడని.. ఆయన తప్పులు చేసి ఇరుక్కున్న సమయంలో ఆయనకు మద్దతుగా ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటాడని మంత్రి ఆర్కే రోజా ఇవాళ విమర్శించారు. దీన్ని బట్టి ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఎంత విధేయతగా ఉన్నాడో అర్థమవుతోందని మండిపడ్డారు.ఇప్పటంలో గోడలకు ఉన్న విలువ.. కందుకూరులో చనిపోయిన వారికి పవన్ కళ్యాణ్ ఇవ్వలేదని రోజా ఆరోపించారు. అయితే జీవో నం 1 రాగానే పవన్ కళ్యాణ్ గొంతు నొక్కేస్తున్నాడని బెంబేలెత్తిపోతున్నాడని ధ్వజమెత్తారు. తాజాగా కందుకూరు, గుంటూరు ఘటనల్లో 11 మంది చనిపోయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ స్పందించడం లేదంటూ వైసీపీ నేతలు వరుసగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే క్రమంలో రోజా కూడా పవన్ ను టార్గెట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సొంత జిల్లాలో ఓడిన మెగా బ్రదర్స్
పవన్ తో సరిపెట్టకుండా మెగా బ్రదర్స్ పైనా రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ముగ్గురిని సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారంటే వారికి రాజకీయ భవిష్యత్తు లేదనే విషయం అర్థమవుతోందని రోజా ఆరోపించారు. సాధారణంగా సినీ నటులు సెన్సిటివ్‌గా ఉంటారని.. అందరికీ సాయం చేస్తారని కానీ వీళ్లు మాత్రం అందుకు భిన్నమని రోజా విమర్శించారు. అందుకే రాజకీయాల్లో వీరిని ప్రజలు ఆదరించలేదని ఎద్దేవా చేశారు. తద్వారా మెగా బ్రదర్స్ ఎవరికీ సాయం చేయరనే అంశాన్ని ప్రస్తావిస్తూ వీరిని రోజా టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

రోజా కామెంట్స్ పై చర్చ ?
తాజాగా పవన్ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన తమ్ముడు పవన్ కళ్యాణ్‌ను అతిగా విమర్శించే వాళ్లు తన దగ్గరికి వచ్చి శుభకార్యాలకు ఆహ్వానిస్తుంటారని దెప్పిపొడిచారు. వారితో మాట్లాడాల్సి రావడం బాధగా అనిపిస్తుందన్నారు. దీంతో చిరంజీవివైసీపీనేతలను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారనే ఊహాగానాలు వినిపించాయి. అందుకే రోజా పవన్ కళ్యాణ్‌తో పాటు చిరంజీవిని కూడా ఈసారి టార్గెట్ చేశారా ? లేక మెగా ఫ్యామిలీ మొత్తాన్ని పొలిటికల్‌గా టార్గెట్ చేయాలని వైసీపీ హైకమాండ్ నుంచి నేతలకు సంకేతాలు వచ్చాయా అన్నది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications