శ్రీవారు గెలిచే ఛాన్సిచ్చారు: రోజా, బాబు అవసరం: గౌడ
చిత్తూరు/విశాఖ: తనకు శ్రీవారు గెలిచే అవకాశమిచ్చారని, అందుకే ఆయనకు ధన్యవాదాలు చెప్పేందుకు కొండకు వచ్చానని ప్రముఖ సినీ నటి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు రోజా ఆదివారం చెప్పారు. రోజా, మరో పార్టీ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ... వెంకటేశ్వర స్వామి తనకు గెలిచే అవకాశమిచ్చారన్నారు.
బాబులాంటి నేత అవసరం: దేవేగౌడ
ఆంద్రప్రదేశ్ అభివృద్ధి పథంలో పయనించాలంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లాంటి నేత అవసరం ఉందని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెరాస అధినేత కెసిఆర్ తెలంగాణను, చంద్రబాబు సీమాంధ్రను అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశిస్తున్నానన్నారు. అలాగే కేంద్రంలో బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీని ప్రజలు ఆదరించారన్నారు.

జగన్‌కు ఝలక్
వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి విశాఖ నగర నేత మళ్ల విజయప్రసాద్ రాజీనామా చేశారు. విశాఖ నగర వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడిగా ఆయన ఉన్నారు. రాజీనామాకు కారణాలు తెలియరాలేదు.
శ్రీవారిని దర్సించుకోనున్న బాబు కుటుంబం
కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనార్థం చంద్రబాబు సోమవారం తిరుమలకు వెళ్తున్నారు. ఎన్నికల్లో టిడిపి విజయం సాధించిన నేపథ్యంలో బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా సోమవారం ఉదయం విమానంలో తిరుపతికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకుంటారు.












Click it and Unblock the Notifications