రోజా సీటు ఖరారు: అప్పుడే ప్రచారం, ఆడపడచు మంత్రం
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకురాలు, సినీ తార అప్పుడే ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్లున్నారు. మీ ఆడపడుచుగా భావించి నన్ను ఆదరించండి అంటూ ఆమె ప్రజలను కోరారు. గురువారం ఆమె గేట్‌పుత్తూరు 5వ వార్డులో ఆమె గడప గడపలో ఒకే నినాదం వైయస్సార్ కాంగ్రెసు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. గురువారం ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది రెండవ రోజు.
తన గడప గడపకు వైయస్సార్ కాంగ్రెసు కార్యక్రమంలో ప్రతి ఒక్కరినీ ఆమె ఆప్యాయంగా పలకరించారు. సమస్యల పరిష్కారం తమ పార్టీ వల్లనే సాధ్యమవుతుందని ఆమె చెప్పుకున్నారు. కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ అధికారంలో ఉన్న కాంగ్రెసు ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆమె అన్నారు.

రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి కాంగ్రెసు ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆమె విమర్శించారు. తెలుగు జాతిలో చిచ్చు పెట్టే వేడుక చూస్తుందని ఆమె అన్నారు. తమ పార్టీ సమైక్య నినాదంతో ముందుకు సాగుతోందని రోజా చెప్పారు. జగనన్న ప్రభుత్వం రావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నగరి నియోజకవర్గంలో ఈసారైనా పాగా వేయాలనేది ఆమె ఎత్తుగడగా కనిపిస్తోంది.
వైయస్ జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ జిల్లా కన్వీనర్ కళత్తూరు నారాయణ స్వామి అన్నారు. నగరి నియోజకవర్గంలో తమ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. కాంగ్రెసు ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ఇస్తూ విభజనవాదానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కారణయ్యారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications