ఏపీ అసెంబ్లీ ఆవరణలో దొంగల హల్ చల్..ఏకంగా 4 లక్షల చోరీ..!
ఏపీ అసెంబ్లీలో దొంగలు హల్ చల్ చేశారు. ప్రజా ప్రతినిధులు, వారి సిబ్బంది, లాయర్ ఇలా ఎవర్నీ లెక్కచేయకుండా వారి జేబులు, పర్సుల నుంచి ఏకంగా 4 లక్షల రూపాయలు దొంగిలించుకుపోయారు. నిన్న జరిగిన కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకార కార్యక్రమం సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో వారంతా అవాక్కయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలోనే ఈ ఘటన జరిగినా దీనిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
ఏపీలో కొత్తగా ఎమ్మెల్యేల కోటాలో ఐదుగురు ఎమ్మెల్సీలు ఎన్నికయ్యారు. వీరిలో టీడీపీ ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఉన్నారు. వీరంతా నిన్న ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏపీ శాసనమండలికి చేరుకున్నారు. అక్కడ శాసన మండలి ఛైర్మన్ కొయ్యే మోషేన్ రాజు వీరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణస్వీకారం చేయించారు.

అయితే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం సందర్భంగా వారితో పాటు చాలా మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. వీరిలో కొందరు చేతి వాటం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు జేబులోని రూ.10వేలు, ఆయన గన్ మెన్ జేబులో ఉన్న రూ.40వేలు, ఓ హైకోర్టు లాయర్ జేబులో రూ.50వేలు, మరో వ్యక్తి జేబులో రూ.32వేలను కొట్టేసినట్లు సమాచారం. ఇలా దొంగలు మొత్తం రూ.4 లక్షలు చోరీ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో అసెంబ్లీ కార్యదర్శి కానీ, పోలీసులు కానీ దీనిపై స్పందించలేదు.












Click it and Unblock the Notifications