చిన్నారిపై పోలీసు దంపతుల దాష్టీకం: తిండి లేదు... శరీరంపై వాతలు, చిట్లిన పుర్రె
మెదక్: మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన చిన్నారి షాహిస్తా సబా కేసులో వెలుగు చూసిన వాస్తవాలను చూస్తే బొల్లారం హెడ్ కానిస్టేబుల్ జాకీర్ హుస్సేన్, అతని భార్య రజియా సుల్తానా దంపతులు ఐదు నెలలుగా తిండి పెట్టకుండా, ఏడిస్తే కాల్చి వాతలు పెట్టినట్లు వైద్య పరీక్షల్లో నిర్దారణ అయింది. చిన్నారి ఎంతో నరకం అనుభవించి చనిపోయిందని వైద్య బృందం నిర్ధారణ చేసింది.
చిన్నారి మృతదేహానికి వైద్య బృందం చేసిన పరీక్షల్లో నిజానిజాలు వెలుగు చూశాయి. పాప తలను బలంగా గోడకేసి కొట్టడంతో పుర్రె అంతర్భాగం చితికిపోయి, మెదడుకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో షాహస్తా సబా చనిపోయిందని వైద్య బృందం నిర్ధారించింది. జాతరలో ఆడుకుంటున్న చిన్నారిని దొంగతనంగా ఎత్తుకొచ్చిన ఈ ఖాకీ దంపతులు అత్యంత క్రూరంగా, దారుణంగా హత్య చేశారు.
సూదులతో వాతలు, ఒళ్లంతా గాయాలు... అమాయకమైన ముఖంతో, స్ట్రెచర్ మీద నిద్రపోయినట్టున్న చిన్నారిని మీడియాలో చూసిన ప్రతి ఒక్కరూ కంట తడి పెట్టారు. హైదరాబాద్‌కు చెందిన పాప తల్లిదండ్రులు మంగళవారం సంగారెడ్డికి వచ్చారు. చిన్నారి సబా ఎలా కిడ్నాప్ అయిందో పోలీసులకు చెప్పి కన్నీరు మున్నీరయ్యారు.

హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని హసన్ నగర్‌కు చెందిన మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతులు మూడో కూతురు షాహిస్తా సబా, అసలు పేరు నౌసిన్ బేగం(5) గత ఏడాది జూలై మాసంలో రంజాన్ పండగ సందర్భంగా తన కుటుంబంతో కలిసి కర్ణాటక రాష్ట్రం గుల్బార్గలోని కేబీఎన్ దర్గాలో జరిగే ఉర్సుకు వెళ్లారు.
అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ కూడా భార్య, ఆరు మంది సంతానంతో కలిసి అదే దర్గాకు వెళ్లారు. ఈమేరకు జూలై 29 నుంచి ఆగస్టు 1 వరకు జాకీర్ హుస్సేన్ సెలవు తీసుకున్నట్లు బొల్లారం పోలీసు స్టేషన్ రికార్డుల్లో నమోదై ఉంది.
జూలై 31న ఇంటికి తిరగి వచ్చేందుకు సిద్ధమైన హెడ్‌కానిస్టేబుల్ కుటుంబానికి దర్గా జాతరలో ఒంటరిగా ఆడుకుంటున్న నౌసిన్‌బేగం కనిపించింది. అప్పటికే ఎక్కువ మంది సంతానానికి చాకిరి చేయలేక ఇబ్బంది పడుతున్న కానిస్టేబుల్ భార్య రజియా సుల్తానా పని మనిషి కోసం వెతుకుతోంది. దీంతో వారిద్దరూ కలిసి చిన్నారిని కిడ్నాప్ చేసి కొండాపూర్ మండలం మల్కాపూర్‌లోని తమ ఇంటికి తెచ్చుకున్నారు.
మరోవైపు కనిపించకుండా పోయిన తన కూతురు కోసం మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దర్గా పరిసర ప్రాంతాల్లో వెతికారు. ఎవరో ఒక మహిళ ఎత్తుకొని పోయిందని స్థానికులు చెప్పడంతో అదే రోజు అంటే జూలై 31న చిన్నారి తల్లిదండ్రులు గుల్భర్గాలోని మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అక్కడి పోలీసులు మరుసటి రోజు అంటే ఆగస్టు 1న కిడ్నాప్ కేసుగా నమోదు చేశారు. కర్ణాటక పోలీసులు కేవలం కేసు నమోదుతోనే వదిలేశారు.
ఆ తర్వాత పాప ఆచూకీ తెలుసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. కేసు దర్యాఫ్తు చేసి ఉంటే పాప ఆచూకీ బయట పడేది. మరో వైపు ఆగస్టు 2వ తేదీన జిన్నారం పోలీసు స్టేషన్లో విధులకు హాజరైన సయ్యద్ జాకీర్ హుస్సేన్ తర్వాత కాలంలో పని కోసం ఒక చిన్న పాపను తెచ్చుకున్నామని తన సహచర పోలీసులకు చెప్పినట్లు బొల్లారం పోలీసులు చెప్తున్నారు.
ఈ విషయం ఎస్‌ఐతో సహా అందరికి తెలుసని ఇక్కడి పోలీసులు తెలిపారు. ఐదేళ్ల చిన్న పాపను పనికోసం తెచ్చి పెట్టుకోవడం నేరమని ఏ ఒక్క పోలీసు చెప్పినా చిన్నారి బతికి ఉండేదని ఇప్పుడు అనుకుంటున్నారు. స్టేషన్ హౌస్ అధికారికి తెలిసినా ఆయన కూడా హెడ్‌కానిస్టేబుల్‌తో ఉన్న సాన్నిహిత్యంతో చెప్పలేకపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి.
ఇంట్లో నుంచి నిరంతరం చిన్నారి ఏడుపులు, అరుపులు వినబడటంతో స్థానికులకు అనుమానం వచ్చి స్ధానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు జాకీర్ ఇంటిని సోదా చేయగా ఇంట్లో దాచి ఉంచిన బాలిక చేతులు, కాళ్లకు వాతలు పెట్టి, బాలికపై వేడి నూనె పోశారు.
దీంతో తీవ్రంగా గాయపడిన బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు సమాచారంతో గురువారం అక్కడికి చేరుకున్న శిశు సంరక్షణ అధికారి ఎం.ఎస్.చంద్ర బాలికను సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. అయితే అక్కడ చికిత్స పొందుతున్న షాహిస్తా సబా మృతి చెందింది.
చంద్ర ఫిర్యాదు మేరకు సంగారెడ్డి పోలీసులు సయ్యద్ జాకిర్ హుస్సేన్ అహ్మద్, భార్య రజియా సుల్తానాలను శనివారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. ఆ దంపతులపై పోలీసులు హత్య కేసు నమోదు చేసి, ఆ బాలిక ఎవరు, ఎందుకు తీసుకువచ్చారు అంటూ పలు కోణాలలో విచారణ జరపినట్లు సంగారెడ్డి డీసీపీ తిరుపలి వెల్లడించారు.












Click it and Unblock the Notifications