సీన్ రిపీట్: సచివాలయంలో పోటాపోటీ ఆందోళన
హైదరాబాద్: రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగులు రెండుగా విడిపోయి ఆందోళనకు దిగారు. అసెంబ్లీలో సోమవారం తెలంగాణ ముసాయిదా బిల్లును స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రవేశపట్టడంతో సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. సీమాంధ్రకు అన్యాయం జరుగుతోందని వారు ఆరోపిస్తూ ఎల్ బ్లాక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.
దాంతో తెలంగాణ ఉద్యోగులు కూడా పోటీగా ఆందోళనకు దిగారు. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సీమాంధ్ర ఉద్యోగులు నిబంధనలను అతిక్రమించారని ఆరోపిస్తూ పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీనిపై ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు స్పందించారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులను అరెస్టు చేయడం అన్యాయమని, పక్షపాత ధోరణితో పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.

మరోసారి ఇలాంటి ఘటన జరిగితే సహించబోమని, ఉద్యమాన్ని తీవ్రస్థాయిలో తీసుకువెళతామని ఆయన హెచ్చరించారు. అలాగే సచివాలయం సీమాంధ్ర ఉద్యోగుల అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తూ విజయవాడలోని ఏపీఎన్జీవో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.
సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగుల అరెస్టును వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు విమర్శించారు. సచివాలయ ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు.












Click it and Unblock the Notifications