మేనిఫెస్టోలో కాపుల రిజర్వేషన్ల అంశం ఏది ..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం కీలక దశకు చేరింది. పార్టీల మధ్య సమరం హోరా హోరీగా మారుతోంది. మేనిఫెస్టోలు విడుదల చేయటంతో పోటీ ఆసక్తి కరంగా మారుతోంది. సంక్షేమ ఓట్ బ్యాంక్ కేంద్రంగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ దశలో మేనిఫెస్టోలో జగన్ తన నవరత్నాలకే ప్రాధాన్యత ఇచ్చారు. చంద్రబాబు ఏపీ భవిష్యత్ పేరుతో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సమయంలోనే మరోసారి కాపు రిజర్వేషన్ల అంశంగా కీలకంగా మారుతోంది.
టీడీపీ, జనసేన తమ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించాయి. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్నా...తమ రెండు పార్టీలే ఈ హామీల అమలుకు బాధ్యత తీసుకుంటాయని చంద్రబాబు స్పష్టం చేసారు. బీజేపీ మద్దతు ఉందని వెల్లడించారు. మేనిఫెస్టోలో బీజేపీకి ప్రమేయం లేకపోవటం పైన ప్రతిపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఈ సమయంలోనే కాపు సంక్షేమ సేన నేత చేగొండి హరిరామ జోగయ్య మేనిఫెస్లో పైన స్పందించారు. తాజాగా లేఖ సంధించారు.

కూటమి ప్రకటించిన మేనిఫెస్టోలో కాపు, బలిజ, ఒంటరి కులస్థులకు జానాభా ప్రాతిపదికన అయిదు శాతం కానీ, విద్యా - ఉపాధి రంగాల్లో రిజర్వేషన్లు లేకపోవటం దారుణమన్నారు. పార్టీల మేనిఫెస్టోలో కాపు రిజర్వేషన్ల అంశం లేకపోవటం ఏంటని ప్రశ్నించారు. దారుణమని ఆవేదన వ్యక్తం చేసారు. వెనుకబడిన కాపుల పట్ల పార్టీలు చిన్నచూపు చూడటం బాధాకరమని పేర్కొన్నారు. ఈ పార్టీలు కాపులను చిన్న చూపు చూడటం ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు హరిరామ జోగయ్య రాసిన లేఖ ప్రచారం వేళ వైరల్ అవుతోంది.
కొద్ది నెలల క్రితం వరకు హరిరామ జోగయ్య అనేక అంశాల పైన జనసేనాని పవన్ కు లేఖలు రాసేవారు. సీట్ల విషయంలోనూ పవన్ కు పలు సూచనలు చేసారు. అయితే, హరిరామ జోగయ్య కుమారుడు వైసీపీ లో చేరారు. తాడేపల్లిగూడెం సభలో తనకు సలహాలు ఇచ్చే వారి పైన పవన్ చేసిన వ్యాఖ్యలతో జోగయ్య తాను ఇక ఎలాంటి సలహాలు ఇవ్వనని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కాపులకు సంబంధించిన అంశాల పైనే జోగయ్య స్పందిస్తున్నారు. మేనిఫెస్టో అంశంలో కాపు రిజర్వేషన్ల అంశం పై జోగయ్య ప్రశ్నిస్తున్నారు. దీని పైన కూటమి నేతలు స్పందిస్తారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications