TTD: తిరుమల లడ్డూల వివాదం, జగన్ పై కేంద్ర మంత్రుల సంచలన వ్యాఖ్యలు
తిరుమల సప్తగిరులపై హిందూయేతర గుర్తులను పెట్టాలని వైఎస్ జగన్ అండ్ కో ప్రయత్నించారని, తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన విద్యాసంస్థల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవార్ల ఫోటోలు తొలగించడానికి అప్పటి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నించిందని, జగన్ ఆగడాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు.
తిరుమల శ్రీవారి మహా ప్రసాదం లడ్డూల తయారీలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా కేంద్రమంత్రి, కర్ణాటక చెందిన బీజేపీ సీనియర్ నాయకురాలు శోభా కరంద్లాజే ఇప్పుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. టీటీడీ బోర్డు చైర్మన్ గా, టీటీడీ బోర్డు సభ్యులుగా హిందువులు కానీ వారిని నియమించారని కేంద్ర సహాయ మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు.

చివరికి తిరుమల పవిత్ర ప్రసాదమైన లడ్డూల తయారిలో కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను ఉపయోగించారని, ఇలా చెయ్యరాని పాపం చేశారని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఆరోపించారు. వెంకటేశ్వర స్వామి, మా చుట్టూ జరుగుతున్న హిందూ వ్యతిరేక రాజకీయాల వలన జరిగిన తప్పుకు మమ్మల్ని క్షమించు స్వామి అంటూ కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే ఎక్స్ లో పోస్ట్ చేశారు.

తిరుమల లడ్డూల తయారి కోసం కల్తీ నెయ్యి ఉపయోగించారనే ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన అంశం చాలా తీవ్రమైందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాల్సిన అవసరం ఉందని, హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా చూసే బాధ్యత అందరిపై ఉందని, తప్పు చేసిన వారిని చట్ట పరంగా శిక్షించాలని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఓ ఆంగ్ల వార్త సంస్థకు చెప్పారు.
గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూలు తయారు చేయడానికి చేప నూనె, జంతువుల కొవ్వు ఉపయోగించారని ఆరోపణలు వచ్చాయి. తిరుమల లడ్డు ప్రసాదాల తయారి కోసం చాప నూనె, జంతువుల కొవ్వుతో తయారు చేసిన నూనెను ఉపయోగించారని గుజరాత్ కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి లాబరేటరీ ఎండీడీబీ కాఫ్ ల్యాబ్ అనుమానం వ్యక్తం చెయ్యడంతో అందరూ షాక్ అయ్యామని, కోట్లాదిమంది శ్రీవారి మనోభావాలను దెబ్బ తీసిన వారు నాశనమైపోతారని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎంతో పవిత్రమైన తిరుమల శ్రీవారి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వులతో తీసిన నూనె వాడారని వెలుగు చూడడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూల ప్రసాదాల తయారి విషయంలో జరిగిన తప్పిదాలపై తిరుమల శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల వివాదం ఎక్కడి వరకు దారితీస్తుందో అని తిరుమల శ్రీవారి భక్తులు విచారం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications