అమరావతికికి మరో ఝలక్- కొత్త రుణాలకు బ్యాంకుల నో- పాత ప్రాజెక్టులతో మెలిక
ఏపీ రాజధాని అమరావతికి కష్టాలు కొనసాగుతున్నాయి. మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా శాసన రాజధానిగా ప్రభుత్వం అభివృద్ధి చేయాలని భావిస్తున్న అమరావతిలో కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు బ్యాంకు రుణాల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే బ్యాంకులు మాత్రం ఇక్కడ పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండా, వాటికి ఇచ్చిన రుణాలు చెల్లించకుండా కొత్త రుణాల కోసం వెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో కొత్తగా అమరావతి కోసం రుణాలు తీసుకునేందుకు వైసీపీ సర్కార్ చేస్తున్న ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలినట్లయింది.

అమరావతికి వరుస షాక్‌లు
అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ప్రక్రియను వైసీపీ సర్కార్ ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి ప్రభుత్వానికే కాదు బ్యాంకులకు కూడా అమరావతి విషయంలో చిన్నచూపు మొదలైంది. అమరావతి నిర్మాణం కోసం గతంలో టీడీపీ సర్కార్ రెండు వేల కోట్ల రుణాలు తీసుకుని వాటిని పూర్తి చేయకుండానే అధికారం కోల్పోవడంతో ఇప్పుడు అక్కడ నిర్మాణాలు పూర్తి చేయాల్సిన బాధ్యత వైసీపీ సర్కార్‌పై పడింది. అయితే అమరావతిలో పాత ప్రాజెక్టులు పూర్తి కాకుండానే కొత్త ప్రాజెక్టులకు వైసీపీ సర్కార్ ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. దీని కోసం బ్యాంకు రుణాలు సేకరించాలని నిర్ణయం తీసుకుంది. అయితే బ్యాంకులు మాత్రం ఇందుకు సిద్ధంగా లేవు.

బ్యాంకుల కన్సార్టియం యూటర్న్
అమరావతిలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులకు బంగ్లాలు, ఐఎఎస్, ఐపీఎస్, ఇతర ఉద్యోగులకు అపార్ట్‌మెంట్ల ఫ్లాట్ల నిర్మాణాన్ని గత టీడీపీ ప్రభుత్వం ఫ్రారంభించింది. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్‌తో కూడిన కన్సార్టియం రూ.2060 కోట్ల రుణాలు ఇచ్చింది. వీటిపై నెలకు రూ.11 కోట్లు ఇప్పటికీ వడ్డీ కడుతున్నారు. ఇప్పుడు ఇదే కన్నార్టియం అమరావతిలో కొత్త ప్రాజెక్టులకు 10 వేల కోట్ల రుణాలు ఇచ్చేందుకు ముందుకొచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. ఇందులో తొలి విడతగా 3 వేల కోట్లు రావాల్సి ఉంది. కానీ ఇప్పుడు బ్యాంకుల కన్నార్టియం తాజాగా యూటర్న్ తీసుకుంది.

పాత ప్రాజెక్టులతో కొత్త రుణాలకు మెలిక
గతంలో అమరావతిలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఇచ్చిన రూ.2060 కోట్ల రుణాన్ని ఖర్చుచేసి ప్రాజెక్టులు నిర్మించినట్లు క్లోజర్ నివేదిక ఇవ్వాలని బ్యాంకుల కన్సార్టియం ఏపీ ప్రభుత్వాన్ని కోరుతోంది. అప్పుడే కొత్త రుణానికి సిఫార్సు చేయనున్నట్లు బ్యాంకుల కన్సార్టియం తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ప్రభుత్వం అటు పాత ప్రాజెక్టులు పాత డీపీఆర్ ప్రకారం పూర్తి చేయలేక, ఇటు కొత్త రుణాలు తీసుకోలేక ఇరుక్కున్నట్లు అర్ధమవుతోంది. ఏదో విధంగా నిధులు మంజూరు చేసి పాత ప్రాజెక్టులు పూర్తి చేసి కొత్త రుణాలు కోరక తప్పని పరిస్ధితి ప్రభుత్వానికి ఎదురవుతోంది.

అమరావతి తేలేదెప్పుడు ?
అమరావతి రాజధానిలో భాగంగా మొత్తం దాదాపు 30 వేల కోట్ల పనులు పెండింగ్‌లో ఉన్నట్లు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే గుర్తించారు. ఇందులో కేవలం 11 వేల కోట్ల మొత్తం పనులకు మాత్రమే దీన్ని కుదించారు. అదే సమయంలో కొత్త ప్రాజెక్టులను తెరపైకి తెచ్చారు. వీటి కోసం రుణాల కోసం అమరావతి మెట్రో డెవలప్ మెంట్ అధారిటీకి ప్రభుత్వం బ్యాంక్ లోన్ గ్యారంటీ ఇచ్చేందుకే 8 నెలలకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత బ్యాంకులు రుణాలు ఇచ్చేందుకు మరింత సమయం తీసుకుంటున్నాయి. అయినా కచ్చితంగా ఇస్తాయన్న గ్యారంటీ కనిపించడం లేదు. బ్యాంకుల కన్సార్టియం కొత్త రుణాలకు అంగీకరించకపోతే ప్రత్యామ్నాయంగా మరో బ్యాంకుల్ని చూసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కనీసం ఏడాదైనా పట్టేలా ఉంది. దీంతో అమరావతికి ఓ రూపు వచ్చేందుకు మరింత సమయం తప్పనిసరిగా మారిపోయింది.












Click it and Unblock the Notifications