అనంతపురంలో వైసీపీకి ఎదురుదెబ్బ- మాజీ మంత్రి గుడ్ బై...!
ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీకి రాయలసీమలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండు రోజుల క్రితమే ఓ మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడగా.. ఇవాళ ఆమె తల్లి, సోదరుడు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. గత ఎన్నికల సమయంలో టీడీపీలో టికెట్ రాలేదనే కారణంతో వైసీపీలో చేరిన ఈ కుటుంబం.. ఇప్పుడు వైసీపీలోనూ ఆదే పరిస్దితి ఎదురుకావడంతో చేసేది లేక రాజీనామా చేశారు. ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ పంపారు.
అనంతపురం జిల్లాలో మాజీ మంత్రి, వైసీపీ నేత పమిడి శమంతకమణి ఇవాళ ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంంలో మంత్రిగా, టీడీపీ హయాంలో ఎమ్మెల్సీగా కూడా పనిచేసిన పమిడి శమంతకమణి కుమార్తె యామినీ బాల కూడా గతంలో శింగనమల నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచిన యామినీ బాలను కాదని చంద్రబాబు బండారు శ్రావణి శ్రీకి టికెట్ ఇవ్వడంతో ఆమెతో పాటు ఈ కుటుంబం టీడీపీని వీడి వైసీపీలో చేరారు.

అయితే ఐదేళ్లుగా వైసీపీలో ఉన్న యామినీ బాల, పమిడి శమంతకమణి, ఆమె కుమారుడు అశోక్ తమలో ఎవరో ఒకరికి ఈసారి శింగనమల టికెట్ వస్తుందని ఆశించారు. కానీ అలా జరగలేదు. దీంతో తిరిగి టీడీపీలోకి వెళ్లేందుకు వీరు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం యామినీ బాల వైసీపీకి గుడ్ బై చెప్పేయగా.. ఇవాళ ఆమె తల్లి శమంతకమణి, సోదరుడు అశోక్ కూడా పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అనివార్య కారణాలతో పార్టీని వీడుతున్నట్లు సీఎం జగన్ కు లేఖ పంపారు.












Click it and Unblock the Notifications