అసమర్థుడివి: కెసిఆర్‌ను ఏకేసిన శ్రవణ్, పొత్తుపై ప్రకాశ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కాంగ్రెసు పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ గురువారం నిప్పులు చెరిగారు. రాత్రికి రాత్రి సీట్లు అమ్ముకునే సంస్కృతి ఉన్న తెరాస పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని తెగనమ్ముకుంటారని ఏకిపారేశారు. ఒక్క కేసిఆర్-వెయ్యి అబద్దాలు అనే ఆడియోను శ్రవణ్ విడుదల చేశారు.
ముఖ్యమంత్రి పదవి కోసం కెసిఆర్ ఆరాటపడుతున్నారని ఆరోపించారు. ఆయన మాటలను ఎవరు నమ్మవద్దన్నారు. పార్టీలో ఉండి తెలంగాణ కోసం పోరాడిన వారికి న్యాయం చేయని కెసిఆర్... నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు.

ఇప్పటి వరకు పార్టీ నిర్మాణం చేసుకోలేదని ఎద్దేవా చేశారు. గ్రామ, మండల, జిల్లా కమిటీలు కూడా వేయలేని ఓ అసమర్థ నేత రాష్ట్రాన్ని ఎలా నిర్మాణం చేస్తారన్నారు. ఆయన వ్యాఖ్యలను చూసి నవ్వాలా ఏడ్వాలా అర్థం కావడం లేదన్నారు. అహంకారంతో మాట్లాడే వారిని, అబద్దాలతో రాజకీయం చేసే వారిని ప్రజలు గెలిపించవద్దని కోరారు. కెసిఆర్ ప్రజలను గౌరవించరని, బడుగు బలహీనవర్గాల వారిని గౌరవించరన్నారు. ఇచ్చిన మాట నిలుపుకున్న వారు సోనియా గాంధీ మాత్ర మే అన్నారు.
పొత్తు బలమైంది: జవదేకర్
అభ్యర్థుల ఎంపికలో టిడిపి, బిజెపిలో విభేదాలు ఉన్నప్పటికీ పొత్తు మాత్రం బలమైనదని బిజెపి అధికార ప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. పొత్తు నేపథ్యంలో పోటీకి దింపిన పార్టీ అభ్యర్థులపై టిడిపి అభ్యంతరం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications