సింగర్ స్మిత స్పందన ఇదే..!!
అమరావతి: కోట్లాది రూపాయల విలువ చేసే స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడికి ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరయింది. షరతులతో కూడిన బెయిల్‌ను ఇచ్చింది ఏపీ హైకోర్టు. నాలుగు వారాల పాటు మాత్రమే చెల్లుబాటయ్యే బెయిల్ ఇది.
ఈ నాలుగు వారాల్లోగా చంద్రబాబు తన కంటికి చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. బెయిల్ పొందుపరిచిన షరతుల ప్రకారం.. మళ్లీ ఆయన నవంబర్ 23వ తేదీ నాటికి సరెండర్ కావాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబుకు 52 రోజుల తరువాత బెయిల్ మంజూరయింది.. అదికూడా షరతులతో.

అనారోగ్య కారణాలతో చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానానికి అభ్యర్థించారు. దీనిపై ఇదివరకే ఓ అనుబంధ బెయిల్ పిటీషన్‌ను దాఖలు చేశారు. గతంలో ఆయన కంటికి ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు మరోసారి దాన్ని సమీక్షించాల్సి ఉందని వాదించారు.
వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీ హైకోర్టు ధర్మాసనం.. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పేపర్లు తమ చేతికి అందిన వెంటనే ఆయనను విడుదల చేస్తామని రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ తెలిపారు. చంద్రబాబు కోసం ఆయన భార్య భువనేశ్వరి, కుమారుడు- మాజీ మంత్రి నారా లోకేష్ తదితరులు రాజమండ్రికి చేరుకున్నారు.
చంద్రబాబుకు బెయిల్ లభించడం పట్ల తెలుగుదేశం పార్టీ నాయకులు హర్షాతిరేకాలను వ్యక్తం చేస్తోన్నారు. హైదరాబాద్, గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయాల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు.
దీనిపై ప్రముఖ గాయని స్మిత స్పందించారు. చంద్రబాబుకు బెయిల్ లభించిన వెంటనే ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో తన అభిప్రాయాన్ని పోస్ట్ చేశారు. చికిత్స కోసం న్యాయానికి స్వేచ్ఛ.. అంటూ కామెంట్ పెట్టారు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరురాలిగా ఆమెకు గుర్తింపు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications