జలసమాధి: స్నానానికి వెళ్లి చెరువులో అక్కాచెల్లెళ్లు గల్లంతు, అక్క మృతదేహం లభ్యం
శ్రీకాకుళం: పాతపట్నం మండలంలోని రంకిణి గ్రామంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆదివారం సాయంత్రం చెరువులో మునిగిపోయారు. చెరువులో గల్లంతైన వారిలో అక్క మృతదేహం లభ్యమవ్వగా, చెల్లి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న స్వాతి(17), పదో తరగతి చదువుతున్న వనజాక్షి(15) అక్కాచెల్లెళ్లు.
వీరిద్దరూ కలిసి గ్రామానికి కి.మీ. దూరంలో ఉన్న చింతల చెరువుకు ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దుస్తులు ఉతకడానికి, స్నానానికి వెళ్లారు. ఈ చెరువు మూడు వైపులా కొండలు కలిసి లోతు కలిగిన రాయి స్థలంలో ఉంటుంది.
అంతా ఆ బండరాయిపైనే స్నానం చేసి, దుస్తులు ఉతుకుతుంటారు. అందరిలాగే వీరు కూడా అటే వెళ్లారు.

అయితే మధ్యాహ్నం చెరువుకు వెళ్లిన వీరు సాయంత్రం వరకు ఇంటికి రాలేదు. దీంతో అక్కాబావలు స్థానికులను అడిగి చెరువు వద్దకు వెళ్లారు. అక్కడ అక్కాచెల్లెళ్ల దుస్తులు, సబ్బు చెరువు ఒడ్డున కనిపించడంతో వెంటనే చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఆరు గంటలకు అక్క స్వాతి మృతదేహం దొరికింది. అప్పటికే చీకటి కావడంతో చెల్లి వనజాక్షి ఆచూకీ దొరకలేదు. రాత్రి కావడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.
అక్కాచెల్లెళ్లు చనిపోవడంతో రంకిణి గ్రామమంతా విషాదం నెలకొంది. స్వాతి, వనజాక్షిల తల్లిదండ్రులు పదేళ్ల కిందటే చనిపోయారు. అప్పటి నుంచి అక్కాబావలు ఒడిశా రాష్ట్రం గండాహతి నుంచి రంకిణి వచ్చేసి వీరిని చూసుకుంటున్నారు. స్వాతి ఇంటర్ పాతపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం హెచ్‌ఈసీ గ్రూపు చదువుతోంది. వనజాక్షి బొమ్మిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
సంక్రాంతి సెలవులు కావడంతో చెల్లి ఇంటికి వచ్చింది. ఆదివారం వీరిద్దరూ ఇద్దరూ అక్కబావలతో కలిసి ఇంటికి ఇటుకలు మోశారు. అంతలోనే వీరి మృతి వార్త వినాల్సి రావడంతో వారు తల్లడిల్లిపోయారు. వనజాక్షి కోసం సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications