Tirumala laddu: లడ్డూపై సీబీఐ దర్యాప్తుకు సర్కార్ ఓకే- సిట్ విచారణకు బ్రేక్..!
ఏపీలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యి కల్తీ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఫిర్యాదు మేరకు జరుగుతున్న సిట్ దర్యాప్తుకు బ్రేక్ పడింది. ఈ మేరకు ఇవాళ తిరుమలలో పర్యటించిన డీజీపీ ద్వారకా తిరుమలరావు కీలక ప్రకటన చేశారు.
సిట్ దర్యాప్తును నిలిపేస్తున్నట్లు తెలిపిన డీజీపీ.. అందుకు గల కారణాలను కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎల్లుండి సుప్రీంకోర్టులో జరిగే విచారణ కూడా కీలకంగా మారిపోయింది.
తిరుమల లడ్డూ విషయంలో రాజకీయాలు చేయొద్దంటూ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు నేరుగా అంటించిన చురకల ప్రభావం సిట్ దర్యాప్తుపైనా పడింది. చంద్రబాబు వ్యాఖ్యల తర్వాత సిట్ దర్యాప్తు ప్రారంభం కావడంపై సుప్రీంకోర్టు స్వయంగా అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పిటిషనర్ల డిమాండ్ మేరకు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంపై స్వతంత్ర దర్యాప్తు సంస్థతో లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్న అంశంపై సుప్రీంకోర్టు ఎల్లుండి నిర్ణయం తీసుకోనుంది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సిట్ దర్యాప్తు కొనసాగిస్తే తలెత్తే పరిణామాలపై అంచనా వేసుకున్న ప్రభుత్వం దానికి బ్రేక్ వేసింది. ఈ మేరకు ఇవాళ తిరుమలలో డీజీపీ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ లాయర్లు చేసిన సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సుప్రీం ఎల్లుండి ఇచ్చే ఆదేశాల తర్వాత సిట్ దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని డీజీపీ తేల్చిచెప్పేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా సీబీఐ దర్యాప్తుకు అభ్యంతరాలు లేదని చెప్తున్న నేపథ్యంలో సిట్ దర్యాప్తు నిలిపివేత ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications