ఏపీలో నిట్‌కు స్మృతి ఇరానీ శంకుస్ధాపన: హాజరైన చంద్రబాబు, వెంకయ్య
అమరావతి: ఏపీకి కేటాయించిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు అంకురార్పణ జరిగింది. నిట్ శాశ్వత భవన నిర్మాణాలకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో గురువారం ఉదయం కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ శంకుస్థాపన చేశారు. దీంతో పాటు నిట్ తరగతులకు అవసరమైన క్యాంపస్‌ను లాంఛనంగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ, సీఎం చంద్రబాబు, కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు, దేవాదాయ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఏపీ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తదితరులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది నుంచే నిట్‌లో తరగతులు ప్రారంభం అవుతాయని ప్రకటించారు. ఈ నెల 28 నుంచి నిట్ తరగతులను తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లిలోని వాసవీ ఇంజినీరింగ్ కళాశాలలో ప్రారంభించనున్నారు.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. తాడేపల్లిగూడెం నిట్‌కు మొత్తం 540 సీట్లు కేటాయించారు. ఇందులో 480 సీట్లను ఈ విద్యా సంవత్సరం నుంచి తాడేపల్లిగూడెంలో నిట్ ద్వారా భర్తీ చేయనున్నారు.
మిగిలిన 60 సీట్లు వరంగల్ నిట్‌లో భర్తీ చేస్తారు. వీరంతా ఆంధ్ర నిట్ ద్వారా అభ్యసిస్తున్నట్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. తాడేపల్లిగూడెంలో నాలుగు సార్లు కౌన్సెలింగ్ పూర్తయ్యే సరికే 383 సీట్లు భర్తీ అయ్యాయి.
మిగిలిన సీట్లను గురువారం భర్తీ చేయనున్నారు. సీట్లు పొందిన విద్యార్ధులంతా తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో అడ్మిషన్ పొందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications