మద్యం మత్తులో తల్లిని చంపిన తనయుడు: ప్లాస్టిక్ కవర్లో శిశువు శవం
విజయవాడ: గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో దారుణ సంఘటన జరిగింది. కాకుమాను మండలంలోని కొమ్మూరులో లైసెన్స్ లేని తుపాకీతో మస్తాన్ వలీ అనే ఓ మాజీ సైనికోద్యోగి తన తల్లినే కాల్చి చంపాడు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
అరవై ఏళ్లకు పైగా వయసున్న ఆ తల్లిని కొడుకే కాల్చి చంపడంతో గ్రామంలో కలకలం చెలరేగింది. ఆర్మీలో రిటైరైన మస్తాన్ వలీ మద్యానికి బానిసగా మారాడని, తన తల్లితో రోజూ గొడవ పడే వాడని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు ఘటనకు సంబంధించి మస్తాన్ వలీపై కేసు నమోదు చేశారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

బైక్‌కు నిప్పంటించిన ఆగంతకులు
ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనంపై ఆగంతకులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల పట్టణంలోని ఆంధ్రబ్యాంక్ వీధిలో బుధవారం తెల్లవారు జామను చోటు చేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న వెంకట్ రెడ్డి వ్యాపారం చేసుకుంటున్నాడు.
మంగళవారం రాత్రి ఇంటికి చేరిన వెంకట్ రెడ్డి బైక్‌ను ఇంటి ముందు పార్క్ చేశాడు. అయితే, బుధవార ఉదయం లేచి చూసేసరికి బైక్ కాలి బూడిదైంది. దీంతో వెంకట్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరులో అప్పుడే పుట్టిన శిశువును గుర్తు తెలియని వ్యక్తులు ఆస్పత్రి గేటు పక్కనే పడేసి వెళ్లిన సంఘటన బుధవారనాడు చోటు చేసుకుంది. గేటు పక్కన ప్లాస్టిక్ కవర్‌లోంచి రక్తం వస్తుండడాన్ని గమనించిన స్థానికులు ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇచ్చారు. వైద్యులు వచ్చి పరిశీలించగా ప్లాస్టిక్ కవర్‌లో అప్పుడే పుట్టిన బాలుడి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications