విజయవాడలో శ్రీ కృష్ణదేవ రాయల వైభవంపై స్పెషల్ ప్రోగ్రామ్
అమరావతి: విజయవాడ త్వరలో ఒక వినూత్న కార్యక్రమానికి వేదిక కాబోతోంది. అలనాటి శ్రీకష్ణ దేవరాయల వైభవాన్ని బెజవాడ వాసుల ముందు సాక్షాత్కరింప చేయబోతోంది. అర్థం కాలేదా?...అయితే ఇది చదవండి.
అత్యంత ప్రసిద్ధ విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీ కృష్ణదేవ రాయలు గురించి తెలియచెప్పేందుకు కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ విజయవాడలో ''సౌండ్ అండ్ లైట్ ప్రోగ్రాం ఆన్ శ్రీ కృష్ణదేవ రాయ'' పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రదర్శించనుంది. రాష్ట్ర భాషా, సాంస్కృ తిక శాఖ దీని నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయనుంది.
దీనికి సంబంధించిన సన్నాహక సమావేశం రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా అధ్యక్షతన సచివాలయంలో జరిగింది. ఈ ప్రదర్శనకు సౌండ్ అండ్ లైట్ కార్యక్రమం కోసం సువిశాలమైన స్థలం కావాల్సి ఉండగా, స్వరాజ్య మైదానంతో పాటు, సిద్దార్ధ అకాడమీకి చెందిన స్థలాలు చర్చకొచ్చాయి. స్థానిక కళాకారులకు ఏడు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం ద్వారా వారిని సంసిద్ధులను చేసి మరో ఏడు రోజుల పాటు ప్రదర్శనలు నిర్వహించాలన్న ముసాయిదాకు సమావేశం ఆమోదం తెలిపింది.

లైటింగ్-సౌండ్ అధారంగా జరిగే ఈ ప్రక్రియ వల్ల మన కళ్ల ముందే రాయల వైభవం జరుగుతున్నట్టు అనిపిస్తుందని, ప్రేక్షకులు కూడా రాయల కాలంలో ఉన్నట్లుగా భావిస్తారని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి విజయకుమార్ రెడ్డి తెలిపారు. కార్యక్రమం విజయవంతమవ్వాలంటే వాతావరణ పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రదర్శనకు అవసరమైన ప్రధాన కళాకారులు పది మంది బెంగుళూరు నుండి వస్తుండగా, ఇతరత్రా అవసరమైన వంద మంది కళాకారులను స్థానికుల నుండి ఎంపిక చేస్తామని సాంస్కృతిక శాఖ సంచాలకులు విజయ భాస్కర్ తెలిపారు.
అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు తరలివచ్చే సందర్శకులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను మీనా ఈ సందర్భంగా ఆదేశించారు. ప్రదర్శన జరుగుతున్న సమయంలో చూపరులకు ఆసక్తి కలిగించే విధంగా ప్రదర్శనశాలలను ఏర్పాటు చేయాలని, పర్యాటక, సాంస్కృతిక శాఖలతో పాటు శిల్పారామం, డ్వాక్రా సంఘాల ద్వారా స్టాళ్లు ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. అనంతరం అమరావతిలో ఈ తరహా ప్రత్యేక ప్రదర్శనకు కావలసిన ఏర్పాట్లపై కూడా ఈ సమావేశంలో చర్చించారు.












Click it and Unblock the Notifications