గందరగోళం: బిల్లుపై స్పీకర్ ప్రకటన, కిరణ్‌కు అస్వస్థత
హైదరాబాద్: తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిందని సభాపతి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రకటించారు. బిల్లు అసెంబ్లీ వెబ్ సైట్లో అందుబాటులో ఉంటుందని తెలిపారు. సభలో రాష్ట్రపతి నుండి వచ్చిన లేఖను అసెంబ్లీ కార్యదర్శి సదారాం చదివి వినిపించారు. అనంతరం సభను అరగంటపాటు వాయిదా వేశారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను సభ్యులకు పంచనున్నట్లు తెలిపారు.
సభ మొదటిసారి వాయిదా పడి తిరిగి ప్రారంభమైన అనంతరం బిల్లు తమకు అందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఈ సమయంలో సభలో గందరగోళం ఏర్పడింది. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంతాల ప్రజాప్రతినిధులు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు.

ముఖ్యమంత్రికి అస్వస్థత
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అస్వస్థతకు గురైనట్లుగా తెలుస్తోంది. ఆయన మూడు రోజులుగా అస్వస్థతతో ఉన్న నేపథ్యంలో అసెంబ్లీకి గైర్హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సభాపతితో టి మంత్రులు
అసెంబ్లీ మొదటిసారి వాయిదా పడిన అనంతరం సభాపతి నాదెండ్ల మనోహర్‌తో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్ బాబు తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వెంటనే సభలో ప్రవేశ పెట్టాలని, చర్చకు అనుమతించాలని కోరారు.

స్పీకర్ ఛాంబర్ వద్ద జగన్ పార్టీ ఎమ్మెల్యేల ఆందోళన
అంతకుముందు అసెంబ్లీలో సమైక్యాంధ్ర కోసం తీర్మానం ప్రవేశ పెట్టాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసన సభ్యులు సభాపతి ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. వారిని నాదెండ్ల లోపలకు పిలిపించి మాట్లాడారు.












Click it and Unblock the Notifications