అదేంకాదు కేసీఆర్ మంచోడు, పవన్‌కళ్యాణ్ రావాలి!: శివాజీ, బాబు అండ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు మద్దతు పలకాలని, సినీ పరిశ్రమ కూడా అండగా నిలబడాలని ప్రముఖ నటుడు శివాజీ అన్నారు. గుంటూరులో ఆయన నాలుగు రోజుల క్రితం నిరసన దీక్ష ప్రారంభించారు.
బుధవారం నాడు పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. తాను ఆసుపత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని శివాజీ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన నాలుగు రోజులుగా... నాయకులకు, సినీ పరిశ్రమకు, ప్రజలకు ప్రత్యేక హోదా విషయంలో విజ్ఞప్తులు చేస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం అందరూ కదలి రావాలని కోరారు. తాను ఎవరిని కూడా ప్రత్యేకంగా ఆహ్వానించబోనని, కానీ ప్రతి ఒక్కరు తనకు మద్దతివ్వాల్సిన అవసరముందని చెప్పారు. గుంటూరుకు వచ్చి తనకు మద్దతివ్వాల్సిన అవసరం లేదని చెప్పారు.
తనకు మద్దతివ్వాలనుకునే ప్రముఖులు ఓ ట్వీట్ చేసి అండగా నిలబడాలని కోరారు. తనకు మద్దతుగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నిలిస్తే ప్రత్యేక హోదా డిమాండ్‌కు మరింత బలం చేకూరుతుందన్నారు. తనకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మద్దతు కూడా కావాలన్నారు.

తెలుగు ప్రజలు సినిమాలు చూడాలంటే, వారి వద్ద డబ్బులు ఉండాలని, అందుకు ప్రత్యేక హోదా రావాల్సిందేనని అన్నారు. లేదంటే తెలుగు సినీ పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కుంటుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా విడిపోయిన నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో సినీ పరిశ్రమ మద్దతు పలికితే తెలంగాణ ప్రజలు లేదా ప్రభుత్వం అప్ సెట్ అవుతుందనే ఊహాగానాలను ఆయన అంగీకరించలేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ చాలా మంచివారని, ఏపీకి ప్రత్యేక హోదాకు మద్దతిచ్చినంత మాత్రాన ఆయన టార్గెట్ చేయరని చెప్పారు. కాగా, ప్రత్యేక హోదా కోసం చేసే ఆందోళనలు సమర్థిస్తానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం గమనార్హం. ఇది శివాజీకి కొండంత అండ అని చెప్పొచ్చు.












Click it and Unblock the Notifications