చంద్రబాబు నెం 7691, స్నేహ బ్లాక్ లో గది - హైకోర్టులో బెయిల్ పిటీషన్..!!
టీడీపీ అధినేత చంద్రబాబు అర్ద్రరాత్రి రాజమండ్రి జైలుకు చేరుకున్నారు. జైలు అధికారులు ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక మినహాయింపులు ఇచ్చారు. జైలులో స్నేహ బ్లాక్‌లోని ప్రత్యేక గదికి తరలించారు. ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. హైకోర్టులో చంద్రబాబు బెయిల్ కోసం లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు కు ఆయన తరపు న్యాయవాదులు నిర్ణయించారు.
అర్ద్రరాత్రి జైలుకు:చంద్రబాబును సీఐడీ అధికారులు ఆదివారం అర్ధరాత్రి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. చంద్రబాబుకు న్యాయస్థానం 14 రోజులపాటు అంటే ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అక్కడ న్యాయస్థానంలో అధికారిక లాంఛనాలు పూర్తి చేశాక సిట్ అధికారులు జైళ్ల ఎస్కార్ట్‌తో ప్రత్యేక కాన్వాయ్‌లో విజయవాడ నుంచి తరలించారు. చంద్రబాబుకు ఇంటి భోజనంతోపాటు మందులు ఇవ్వడానికి కోర్టు అనుమతించింది. భద్రతా కారణాల వల్ల మిగతా ఖైదీలతో కాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

అనుసరించిన లోకేశ్:చంద్రబాబును తరలిస్తున్న కాన్వాయ్ అర్ధరాత్రి ఒంటి గంట అనంతరం సురక్షితంగా రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు చేరుకుంది. అనంతరం రిమాండ్ ఖైదీ చంద్రబాబును జైలు అధికారులకు అప్పగించారు. జ్యుడిషియల్ రిమాండ్‌కు సంబంధించిన అధికారిక లాంచనాలు పూర్తి చేసి, ఆయనకు రిమాండ్ ఖైదీ నంబర్ 7691 కేటాయించారు. కోర్టు ఆదేశాలతో ఆయనకు ప్రత్యేకంగా ఆహారం, అవసరమైన మందులు, ఇతర వసతులు కల్పించనున్నారు.
రిమాండ్ ఖైదీగా చంద్రబాబును సెంట్రల్ జైలుకు తరలించడంతో ఎన్‌ఎస్‌జీ భద్రతా సిబ్బంది తాత్కాలికంగా ఆయన భద్రతా విధుల నుంచి వైదొలిగారు. చంద్రబాబు వెంట తనయుడు నారా లోకేష్ జైలు వద్దకు చేరుకున్నారు. సదుపాయాలపై అధికారులతో చర్చించారు.

సోషల్ మీడియాలో వైరల్ :రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నంబరు కేటాయించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7 + 6 + 9 + 1 = 23 కావడమే అందుకు కారణం. 2019 ఎన్నికల్లో టీడీపీకి 23 సీట్లే వచ్చాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలు కలిపితే మొత్తం 23 అవుతోంది. దాంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అయ్యాయి. అటు చంద్రబాబు బెయిల్ కోసం హైకోర్టులో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేస్తున్నారు. ఇటు చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలన్న సీఐడీ పిటీషన్ పైన ఈ రోజు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది.బాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు 144 సెక్షన్ విధించారు.












Click it and Unblock the Notifications