ఇప్పుడొచ్చే ఓటీటీ థ్రిల్లర్స్ కు ఈ సినిమా తాత లాంటిది

నేటి డిజిటల్ యుగంలో ఓటీటీ వేదికలపై విభిన్నమైన సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు, సినిమాలను చూస్తూ "అబ్బా.. ఏం స్క్రీన్‌ప్లే రా బాబు!" అని మనం నోళ్లు వెళ్లబెడుతుంటాం. కానీ, సరిగ్గా 40 ఏళ్ల క్రితమే.. ఎలాంటి సాంకేతిక హంగులూ లేని రోజుల్లోనే, సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ అనుభూతిని పరిచయం చేసిన 'తాత' లాంటి మాస్టర్ పీస్ సినిమా ఒకటి మన తెలుగులో వచ్చింది. అదే.. దర్శకుడు వంశీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'అన్వేషణ'. తెలుగు ప్రేక్షకులకు సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే ఎప్పుడూ ఇష్టమే అయినా, మన దగ్గర గ్రిప్పింగ్ కథలు రాకపోవడంతో పరభాషా చిత్రాలపై ఆధారపడేవారు. ఆ లోటును తీరుస్తూ 1985లో వచ్చిన 'అన్వేషణ' టాలీవుడ్ థ్రిల్లర్ జానర్‌లోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది.

అడవి నేపథ్యంలో ఒక సరికొత్త ప్రయోగం

1984లో 'సితార' సినిమాతో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు వంశీ విభిన్న ఆలోచనా ధోరణి నిర్మాతలను బాగా ఆకట్టుకుంది. ఆ సమయంలో 'ఇంటింటి కథ' చిత్ర నిర్మాత కామినేని ప్రసాద్, వైజాగ్ అప్సర హోటల్ ఓనర్ చిన్నా కలిసి బడ్జెట్ పరిమితులు లేకుండా వంశీ తో ఒక సినిమా చేయడానికి ముందుకు వచ్చారు. చిన్నప్పటి నుంచి సస్పెన్స్ నవలలను అమితంగా ఇష్టపడే వంశీ .. 1978లో కన్నడలో విడుదలై, తెలుగులోనూ వంద రోజులు ఆడిన 'అపరిచిత' అనే అడవి నేపథ్య థ్రిల్లర్ ఇన్స్పిరేషన్‌తో మెయిన్ ప్లాట్ సిద్ధం చేసుకున్నారు. దీనికి హాలీవుడ్ క్లాసిక్స్ 'విజిటింగ్ అవర్స్', 'ఈవిల్ అండర్ ద సన్' చిత్రాల ప్రభావం కూడా తోడైంది.

Anveshana The 40-Year-Old Telugu Thriller That Inspired Todays OTT Suspense Hits

ప్రకృతి సృష్టించిన విరామం.. అరకులో పుట్టిన స్క్రిప్ట్

కథ రెడీ అయ్యాక డైలాగ్స్ కోసం యండమూరి వీరేంద్రనాథ్, తనికెళ్ల భరణి లాంటి ప్రముఖ రచయితలను సంప్రదించినా, వంశీ కి ఏ వెర్షన్ నచ్చలేదు. షూటింగ్‌కు కేవలం పది రోజులే సమయం ఉందనగా.. నాటి ప్రధాని ఇందిరా గాంధీ హత్య జరగడం, ఆ వెంటనే వరదలు రావడంతో ఇండస్ట్రీలో షూటింగ్‌లు బంద్ అయ్యాయి. దొరికిన ఈ ఊహించని విరామాన్ని వాడుకుంటూ వంశీ అరకు వెళ్ళిపోయి, తనే స్వయంగా పూర్తి డైలాగ్స్‌తో కూడిన బౌండెడ్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్నారు. హీరోగా కార్తీక్, హీరోయిన్‌గా 'సితార' ఫేమ్ భానుప్రియ ఎంపికవగా.. ఒక కీలక పాత్రకు డాన్సర్ సుమతిని తీసుకున్నారు. సత్యనారాయణ, శరత్ బాబు, రాళ్లపల్లి, శుభలేఖ సుధాకర్ వంటి భారీ తారాగణంతో పాటు.. ఇళయరాజా (సంగీతం), ఎం.వి. రఘు (సినిమాటోగ్రఫీ), అనిల్ మల్నాడ్ (ఎడిటింగ్) లాంటి అద్భుతమైన టెక్నికల్ టీమ్ కుదిరింది.

తలకోన అడవుల్లో 60 రోజుల భయానక ప్రయాణం

1985 జనవరిలో కేవలం 15 లక్షల పరిమిత బడ్జెట్‌తో తిరుపతి సమీపంలోని తలకోన అడవుల్లో షూటింగ్ ప్రారంభమైంది. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన అద్భుతమైన సెట్టింగ్స్‌లో, 'నెరబయలు' అనే గ్రామంలో యూనిట్ అంతా స్టే చేసి.. భయపడుతూనే రాత్రింబవళ్లు 60 రోజుల పాటు అడవిలోనే షూటింగ్ పూర్తి చేశారు. కొంత భాగం బాక్రాపేటలోనూ చిత్రీకరించారు. ఈ సినిమాతోనే నటి భానుప్రియ తొలిసారిగా తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం.సాధారణంగా రీరికార్డింగ్‌ను నాలుగు రోజుల్లో ముగించే మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా.. 'అన్వేషణ' అవుట్‌పుట్ చూసి షాక్ అయి, ఆర్ఆర్ కోసం ప్రత్యేకంగా వారం రోజులు సమయం తీసుకున్నారు. పక్షుల కిలకిలరావాలు, గాలి శబ్దాలు, సెలయేటి గలగలలను బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లో మిక్స్ చేస్తూ ఆయన సృష్టించిన మ్యూజిక్ ప్రేక్షకుడిని నేరుగా తలకోన అడవిలోకి తీసుకెళ్లి కూర్చోబెట్టింది. "ఏకాంత వేళ", "కీరవాణి" వంటి ఎవర్గ్రీన్ హిట్ సాంగ్స్‌తో పాటు.. ఇందులోని టైటిల్ ట్రాక్ ట్యూన్‌నే ఇళయరాజా తర్వాత 'అభినందన'లో "ఎదుట నీవే" పాటకు వాడుకున్నారు.

1985లో విడుదలైంది

1985 మే 22న విడుదలైన 'అన్వేషణ' థియేటర్లలో సంచలనం సృష్టించింది. క్లైమాక్స్ వరకు హంతకుడు ఎవరో గుర్తుపట్టలేనంత గ్రిప్పింగ్‌గా సాగిన స్క్రీన్‌ప్లే, చివర్లో రివీల్ అయ్యే ఎమోషనల్ ఫ్లాష్‌బ్యాక్ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. సాధారణంగా సస్పెన్స్ సినిమాలకు రిపీట్ వాల్యూ తక్కువగా ఉంటుంది, కానీ వంశీ సింబాలిక్ షాట్స్, టేకింగ్ వల్ల జనాలు ఈ సినిమాను మళ్లీ మళ్లీ చూశారు. అప్పట్లోనే ఈ చిన్న సినిమా 17 కేంద్రాల్లో 50 రోజులు, షిఫ్ట్‌లతో కలిపి 11 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శితమై.. రిపీట్ రన్‌తో కలిపి ఏకంగా కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి హిస్టరీ క్రియేట్ చేసింది. మద్రాస్‌లోని వుడ్‌లాండ్స్ హోటల్‌లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు, జయసుధ ముఖ్య అతిథులుగా ఈ చిత్ర శతదినోత్సవ వేడుక వైభవంగా జరిగింది. దశాబ్దాలు గడిచినా, సాంకేతికత ఎంత పెరిగినా.. ఈనాటికీ తెలుగులో ఒక పక్కా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా తీయాలనుకునే ఏ దర్శకుడికైనా 'అన్వేషణ' ఒక పాఠ్యపుస్తకం అనడంలో ఎలాంటి సందేహం లేదు!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+