Amaravati: చంద్రబాబు, నారాయణపై వైసీపీ కేసును తేల్చేసిన సుప్రీంకోర్టు..!
ఏపీ రాజధాని అమరావతిలో (Amaravati) అసైన్డ్ భూముల అక్రమాల కేసులో సుప్రీంకోర్టు (Supreme Court) ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. గతంలో అమరావతిలో భూసేకరణ సందర్భంగా అప్పటి చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆళ్ల రామకృష్ణారెడ్డికి అక్కడా నిరాశ తప్పలేదు.
రాజధానిలో ల్యాండ్ పూలింగ్ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ దురుద్దేశపూరితంగా ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా అసైన్డ్ భూముల కుంభకోణానికి పాల్పడ్డారంటూ వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. చంద్రబాబు, నారాయణకు క్లీన్ చిట్ ఇచ్చింది. పాలనాపరంగా తీసుకున్న నిర్ణయాల్ని అక్రమాలను చెప్పలేమని తేల్చిచెప్పేసింది. దీంతో ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. అందులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. రాజకీయ కక్షసాధింపుతోనే చంద్రబాబు, నారాయణపై వైసీపీ హయాంలో కేసులు నమోదు చేసినట్లు గతంలో హైకోర్టు చేసిన వ్యాఖ్యల్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. ఈ కేసులో బాధితులు లేనప్పుడు స్కాం జరిగిందని ఎలా చెప్తారంటూ పిటిషనర్ ను నిలదీసింది. దీంతో ఈ కేసును కొట్టివేస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సుప్రీం తీర్పుతో చంద్రబాబు, నారాయణపై గత వైసీపీ ప్రభుత్వం పెట్టిన కేసు తేలిపోయినట్లయింది.














Click it and Unblock the Notifications