బాలయ్య యాక్షన్ సీన్ క్లిప్ తో ట్రంప్ కు ఇరాన్ ఘాటు కౌంటర్..!
అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఈ ఏడాది ఆరంభంలో ఇరాన్ పై (Iran) ప్రారంభించిన యుద్దం ఇంకా కొనసాగుతోంది. మధ్యలో చర్చల పేరుతో కాస్త హంగామా చేసిన ట్రంప్.. ఆ తర్వాత తిరిగి దాడులు మొదలుపెట్టేశారు. తాజాగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇరాన్ ను భయపెట్టేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఇరాన్ ను ఈ భూమిపై లేకుండా చేస్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నారు. దీనిపై ఇరాన్ ఘాటుగా స్పందించింది.
ట్రంప్ ఇరాన్‌ను నాశనం చేయడం గురించి మాట్లాడుతున్నారు, కానీ ఇరాన్ నిస్సహాయమైనది కాదని ఆయనకు తెలుసంటూ జింబాబ్వేలోని ఇరాన్ ఎంబసీ కౌంటర్ ఇచ్చింది. తమకు హెచ్చరికలు చేసిన తర్వాత ట్రంప్ హాలీవుడ్ సినిమాలకు బదులు బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారంటూ ఇరాన్ తెలిపింది. ఈ ట్వీట్ కు నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సినిమా భగవంత్ కేసరిలోని ఓ ఫైట్ సీన్ క్లిప్ ను కూడా జత చేసింది. ఇందులో బాలయ్య యాక్షన్ ప్రేక్షకులతో విజిల్స్ వేయిస్తూ అదిరిపోయేలా ఉంది.

Trump talks about annihilating Iran.
— Iran Embassy in Zimbabwe (@IRANinZIMBABWE) September 23, 2026
But he knows Iran is not defenseless.
Since we informed they have recently been watching Bollywood instead of Hollywood. pic.twitter.com/v6Le8zkH5X
ఈ సీన్ లో బాలయ్య తనపై ప్రత్యర్థులు తూటాల వర్షం కురిపించడం ప్రారంభించగానే, ఒక్కసారిగా తాను కూర్చొన్న సీటులో నుంచే పక్కనే ఉన్న మ్యాన్ హోల్ మూతను తీసి పట్టుకుని తూటాల్ని అడ్డుకుంటారు. అలా గుళ్ల వర్షం కురిపించీ, కురిపించీ రౌడీల దగ్గర గన్లలో తూటాలు కూడా అయిపోతాయి. అప్పుడు భారీ గన్ లను తీసుకుని బాలయ్య వారిపై ఎదురుదాడి ప్రారంభించేందుకు సిద్దమవుతారు. కానీ ఆ భారీ గన్ పట్టుకోకుండా వదిలేసి, అక్కడే ఉన్న గ్యాస్ సిలెండర్లను లాగి, పదునైన ఆయుధంతో వాటి గ్యాస్ లీక్ చేసి ప్రత్యర్ధులపైకి వదులుతారు. గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్న ఈ సీన్ హిందీ డబ్బింగ్ సీన్ ను ఇరాన్ షేర్ చేసింది. దీంతో తమపై దాడులు చేస్తామంటూ బెదిరిస్తున్న ట్రంప్ కు చురకలు అంటించింది. ఇవాళ ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ట్రంప్ తో పాటు ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా ప్రసంగించాల్సి ఉన్న తరుణంలో ఇరాన్ ఈ క్లిప్ షేర్ చేసింది. దీంతో ఇది వైరల్ అవుతోంది.














Click it and Unblock the Notifications
