వినాయకుని విగ్రహంపై హెలికాప్టర్ నుంచి పూల వర్షం.. హైదరాబాద్ లో అరుదైన దృశ్యం..
దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలకు ముంబై కేరాఫ్ అడ్రస్ అని చెబుతుంటారు. కానీ ఈసారి గణేష్ ఉత్సవాలకు హైదరాబాద్ ట్రెండ్ సెట్టర్ గా మారింది. ఎన్నడూ లేని విధంగా ఈసారి గణేష్ నవరాత్రులు హైదరాబాద్ లో ఘనంగా జరిగాయి. గల్లీ గల్లీలో వినాయకుడి మండపాలు.. ఆటలు.. పాటలు.. డీజే మోతలతో దద్దరిల్లిపోయాయి. ఇక గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు ట్యాంక్ బండ్ వద్ద అట్టహాసంగా జరుగుతున్నాయి. భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు తరలివస్తున్నారు. దాంతో ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక భాగ్య నగరంలో నిమజ్జన శోభాయాత్రలు, ఉత్సవాలు సురక్షితంగా ముగిసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టారు పోలీసులు. ఈ మేరకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయితే వినాయకుడి నిమజ్జన కార్యక్రమం వేళ హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.
కుత్బుల్లాపూర్ : బౌరంపేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో వినాయక సంబరాలు అంబరాన్ని అంటాయి.
— TV9 Telugu (@TV9Telugu) September 23, 2026
హెలికాప్టర్ ద్వారా వినాయకుని విగ్రహంపై పూల వర్షం కురిపించారు. భౌరంపేట్ బొడ్రాయి వద్ద నిర్వహించిన గణనాథుడికి ఏర్పాటుచేసిన మండపపై ఉంచిన విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం… pic.twitter.com/usako3ejm3
కుత్బుల్లాపూర్ లో బౌరంపేట్ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో వినాయక సంబరాలు అంబరాన్ని తాకాయి. మునుపెన్నడూ లేని విధంగా గణేష్ కు వీడ్కోలు పలికారు భక్తులు. ఈ మేరకు హెలికాప్టర్ ద్వారా వినాయకుని విగ్రహంపై పూల వర్షం కురిపించి తమ భక్తిని చాటుకున్నారు. బౌరంపేట్ బొడ్రాయి వద్ద నిర్వహించిన గణనాథుడికి ఏర్పాటుచేసిన మండపంపై ఉంచిన విగ్రహానికి పూజలు నిర్వహించిన అనంతరం హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించడంతో స్థానికులు కేరింతలు కొట్టారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని చూసేందుకు భారీ ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఇక ఇటీవల ఏపీలోని హిందూపురంలోనూ ఇలాంటి అరుదైన ఘటనే జరిగింది. హిందూపురంలో 50 అడుగుల భారీ గరిడి గణేష్ విగ్రహంపై బెంగళూరు నుంచి ప్రత్యేకంగా తెప్పించిన హెలికాప్టర్ తో పూల వర్షం కురిపించారు భక్తులు. ఇప్పుడు హైదరాబాద్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయింది.

ఇక హైదరాబాద్ లో ఈ నెల 25న సామూహిక నిమజ్జనం కార్యక్రమం జరగనుంది. నిమజ్జనం కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేందుకు.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 25 న వేలాది విగ్రహాలు నిమజ్జనం జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో నగరం వ్యాప్తంగా దాదాపు 20 వేల మంది పోలీసులను మోహరించారు. అటు ఖైరతాబాద్ గణేష్, బాలాపూర్ గణేష్ కూడా అదే రోజు నిమజ్జనం నేపథ్యంలో శోభాయాత్రకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా ఉండేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఖైరతాబాద్ వినాయకుడి దర్శనాలు ఈ రాత్రి 12 గంటలకే పూర్తి కానున్నాయి.












Click it and Unblock the Notifications
