రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్: సీఎం చంద్రబాబు కీలక సూచనలు
రాష్ట్రంలో పెరుగుతోన్న విద్యుత్ డిమాండ్ అంచనా వేసి తదనుగుణంగా ప్రణాళికలు రూపొందించి తక్షణం వాటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. వచ్చే 6 నెలల్లో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున విద్యుత్ కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఎల్ నినో వంటి సమస్యల కారణంగా వర్షాకాలంలో కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగిందని...ఇలాంటి సవాళ్లను ముందుగానే అంచనా వేసుకుని ఎదుర్కోవాలని ముఖ్యమంత్రి సూచించారు. బుధవారం క్యాంప్ కార్యాలయంలో విద్యుత్ రంగంపై ఆ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు విద్యుత్ డిమాండ్ 18.23 శాతం పెరిగిందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
విద్యుత్ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడంతో పాటు మార్కెట్లో విద్యుత్ ధరలు కూడా తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం ప్రైవేటు సంస్థలపై ఆధారపడడం తగ్గించాలని సీఎం సూచించారు. దీనికోసం ప్రణాళికా బద్దంగా ప్రభుత్వ ప్రాజెక్టులు గ్రౌండ్ చేయాలన్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచమని ఎన్నికల్లో హామీ ఇచ్చామని...దానికి కట్టుబడి ఉన్నామని గుర్తు చేసిన సీఎం... విద్యుత్ కొనుగోలు భారం తగ్గించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్ డిమాండ్, ఉత్పత్తి, సరఫరా వంటి అంశాల్లో ఏఐ వంటి టెక్నాలజీని ఉపయోగించి సామర్థ్యం పెంచుకోవాలన్నారు. అప్పుడు అధిక ధరకు విద్యుత్ కొనుగోలు చేయాల్సిన అవసరం కూడా ఉండదని సీఎం అన్నారు.
చోరీలపై కఠిన చర్యలు
విద్యుత్ ట్రాన్స్ ఫార్మార్ల చోరీల అంశం కూడా సమీక్షలో చర్చకు వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో, పొలాల్లో ఉన్న ట్రాన్స్ ఫార్మర్లు పెద్ద ఎత్తున చోరీకి గురవుతున్నాయని అధికారులు తెలిపారు. రాగి తీగలు కోసం ట్రాన్స్ ఫార్మర్లు దొంగిలిస్తున్నారని అధికారులు తెలుపగా..ఇటువంటి చర్యలకు పాల్పడుతోన్న వారిపట్ల అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం అదేశించారు. ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించడంతో పాటు విద్యుత్ సరఫరాలో సమస్యలకు కారణం అవుతున్న వారిని వదిలిపెట్టవద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ విషయంలో దర్యాప్తునకు పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని.. చోరీలకు పాల్పడే వారికి గట్టి గుణపాఠం చెప్పాలని సీఎం అన్నారు.
గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులు వేగవంతం కావాలి
రాష్ట్రంలో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని భారీగా పెంచే దిశగా చేపట్టిన ప్రాజెక్టులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 2024 నుంచి విద్యుత్ రంగంలో 103 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని, వీటి ద్వారా రూ.4.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు వివరించారు. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్లో విద్యుత్ రంగానికి సంబంధించి రూ.2.56 లక్షల కోట్ల విలువైన పెట్టుబడుల ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు.
పెట్టుబడుల ఆకర్షణతో పాటు ఒప్పందాలు కార్యరూపం దాల్చడంపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఎంవోయూలు చేసుకున్న ప్రతి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టు క్షేత్రస్థాయిలో ప్రారంభమయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3 కింద రాష్ట్రంలో రూ.21,838 కోట్లతో భారీ విద్యుత్ సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేయనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కారిడార్ ద్వారా 47 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సరఫరా సామర్ధ్యానికి అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరగా టెండర్లు పిలిచి, రెండేళ్లలోగా కార్యరూపంలోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
36,050 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ లక్ష్యం
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 36,050 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు అధికారులు వివరించారు.పోలవరం పరిసర ప్రాంతాల్లో 27 పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు అనువైన ప్రాంతాలను గుర్తించినట్లు అధికారులు తెలిపారు.
పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై మరింత పరిశోధన, అధ్యయనం జరగాలని సీఎం సూచించారు. పీఎం సూర్య ఘర్ పథకం అమలులో ప్రస్తుతం దేశంలో నాలుగో స్థానంలో ఉన్న మన రాష్ట్రాన్ని మొదటి స్థానానికి తీసుకువెళ్లాలని సీఎం నిర్దేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలపై సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుతో పాటు... సాగునీటి ప్రాజెక్టులు, కాలువ గట్లపై సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పాల్సి ఉందన్నారు. సోలార్ రూఫ్ టాప్లో నాయుడుపేట, మాచర్ల, నరసరావుపేట డివిజన్లు ముందున్నాయని అధికారులు తెలిపారు.

అలాగే ఇప్పటి వరకు 7.42 లక్షల రూఫ్ టాప్ సోలార్ ఇన్ స్టాలేషన్లు పూర్తి చేసినట్టు అధికారులు పేర్కొనగా, 10 లక్షల లక్ష్యాన్ని డిసెంబర్ నాటికి చేరుకోవాలని సీఎం స్పష్టం చేశారు. పీఎం కుసుమ్ పథకం కింద 224 ప్రాంతాల్లో 1,162 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ల పనుల్లో పురోగతి ఉందని అధికారులు వివరించారు. పీఎం కుసుమ్ ప్రాజెక్టుల కోసం భూసేకరణ 100 శాతం పూర్తి చేశామని, అలాగే సివిల్ పనులు 91 శాతం పూర్తయినట్టు అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications
