యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. బీజీఎంతో గుండె ఆగిద్ది!
కొన్ని సినిమాలకు ఒక చిత్రమైన కిక్ ఉంటుంది. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ సినిమాలంటే ఉండే క్రేజే వేరు. సీన్లు భయంకరంగా ఉంటే గుండెలు గుభేల్‌మన్నా, ఆ భయంకరమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కు వెన్నులో వణుకు పుట్టినా... లైట్లన్నీ ఆర్పేసి మరీ కళ్లార్పకుండా చూస్తుంటాం. రొటీన్ కమర్షియల్ డ్రామాలు, వెటకారపు కామెడీలు ఇవ్వలేని అసలైన థ్రిల్‌ను అందించడమే ఈ జానర్ ప్రత్యేకత!
మన తెలుగులో సస్పెన్స్, హారర్ సినిమాలు అనగానే చాలా వరకు కామెడీని దట్టించి ఒరిజినల్ ఫ్లేవర్‌ను పక్కదారి పట్టిస్తుంటారు. కానీ, అసలైన హారర్ వాతావరణాన్ని, సీటు అంచున కూర్చోబెట్టే ఉత్కంఠను పక్కాగా అందించి ప్రేక్షకులను అల్లకల్లోలం చేసిన సినిమా మాత్రం ఒక్కటే... అదే 'మసూద'.

థియేటర్‌లో చూసినోళ్లకి తెలుసు ఆ భయం!
బిగ్ స్క్రీన్‌పై మసూద చూపించిన ఇంపాక్ట్ సామాన్యమైనది కాదు. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ సీన్ చూసి ఉలిక్కిపడని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు! సౌండ్ డిజైన్, విజువల్స్ భయపెడుతూనే కథలోకి లీనం చేస్తాయి. నాటి థియేటర్ ఎక్స్‌పీరియన్స్‌ను మిస్సయిన వారు ఇప్పటికీ ఫీల్ అవుతుంటారంటే ఈ సినిమా రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. తిరువీర్, కావ్య కల్యాణ్‌రామ్, బాంధవి శ్రీధర్, సీనియర్ నటి సంగీత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఓటీటీలో అడుగుపెట్టాక సంచలనం సృష్టించింది. మొదట ఆహా, ఆ తర్వాత ప్రైమ్ వీడియోలలో విపరీతమైన ఆదరణ పొందింది.
చూడనివారికి గోల్డెన్ ఛాన్స్
అయితే ఇప్పటివరకు ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లేక లేదా సమయం కుదరక ఈ మాస్టర్‌పీస్‌ను చూడని వారికి ఇప్పుడు గోల్డెన్ ఛాన్స్! ఈ సినిమా ప్రస్తుతం యూట్యూబ్‌లో పూర్తి ఉచితంగా అందుబాటులోకి వచ్చింది. సస్పెన్స్, ప్యూర్ హారర్ సినిమాలను ఇష్టపడేవారైతే కథేంటో ముందే తెలుసుకోకుండా, ఎలాంటి స్పాయిలర్స్ లేకుండా నేరుగా చూసేయండి. ఆ థ్రిల్లింగ్ అనుభూతిని సొంతం చేసుకోండి!














Click it and Unblock the Notifications