రాజగోపాల్ రెడ్డి పై పార్టీ హైకమాండ్ కీలక నిర్ణయం..!?
తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామం. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంలో కీలక నిర్ణయాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా రాజగోపాల్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం పైన పార్టీ హైకమాండ్ కు నివేదికలు వెళ్లాయి. వీటి పైన రాష్ట్ర ఇంఛార్జ్ నుంచి ఏఐసీసీ ఆరా తీసినట్లు తెలుస్తోంది. టీపీసీసీ సైతం రాజగోపాల్ రెడ్డి వ్యవహారం పై ఆగ్రహంగా ఉంది. దీంతో.. రాజగోపాల్ పై హైకమాండ్ తీసుకునే నిర్ణయం పై ఉత్కంఠ కొనసాగుతోంది.
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం మరోసారి చర్చగా మారింది. తాజాగా రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల తో వివాదం మొదలైంది. ''ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు. ఇది సహించరానిది.." అంటూ రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కలకలంగా మారాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరుతో లక్షల కోట్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. 'దోపిడీదారుల వెంటపడుతాం. ఆ దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం' అని హెచ్చరించారు. దీంతో.. ఈ వ్యాఖ్యల పైన పార్టీ ముఖ్య నాయకత్వం సీరియస్ అయింది.

టీపీసీసీ చీఫ్ సీరియస్
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వివాదం పై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. హైకమాండ్ తో మాట్లాడుతున్నామని చెప్పారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి పైన హామీ ఉందని..ఆ విషయం పైన ఢిల్లీకి వెళ్లి మాట్లాడుకోవచ్చని సూచించారు. ఆయనకు హామీ ఇచ్చినట్లు తనకు సమాచారం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేసారు. ఎవరి హద్దులో వారు ఉండాలని .. ఎవరైనా సరే గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. పార్టీ ఎప్పుడు ఎవరి సేవలు వాడుకోవాలో తెలుసని వ్యాఖ్యానించారు. ఎవరైనా ఏ వేదిక పై ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడాలని పేర్కొన్నారు. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన రాజగోపాల్ రెడ్డి పైన ఢిల్లీకి నివేదికలు వెళ్లాయి. తరువాత రాహుల్ గాంధీతో రాజగోపాల్ భేటీతో సమస్య సర్దుమణిగింది. కాగా, ఇప్పుడు తిరిగి రాజగోపాల్ వ్యాఖ్యల పైన పార్టీ సీరియస్ గా ఉండటంతో.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది.













Click it and Unblock the Notifications