సీబీఐకి కల్తీ మద్యం కేసు ? సర్కార్ కు హైకోర్టు నోటీసులు..!
ఏపీలో కల్తీ మద్యం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో అరెస్టు అయిన టీడీపీ నేతల్ని ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ తర్వాత సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. అలాగే నిందితుడు జనార్ధన్ రావుతో సంబంధాలు ఉన్నట్లు చెబుతున్న వైసీపీ నేత జోగి రమేశ్ ను అరెస్టు చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న జనార్ధన్ రావు ఇచ్చిన వీడియో వాంగ్మూలం ఆధారంగా జోగి రమేశ్ ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు.
కల్తీ మద్యం కేసుపై దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఈ కేసులో నిందితుడు విడుదల చేసిన వీడియోను వాంగ్మూలంగా తీసుకుని తనను అరెస్టు చేయడం సరికాదని, దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని జోగి రమేశ్ హైకోర్టును కోరారు. దీనిపై తమ స్పందనలు తెలియజేయాలంటూ హైకోర్టు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయానంద్, హోంశాఖ కార్యదర్శి, డీజీపీల్ని ఆదేశిస్తూ నోటీసులు పంపింది.

జోగి రమేశ్ పిటిషన్ పై సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం కక్షసాధింపులతో ,, రాజకీయ కోణంలోనే ఈ కేసును దర్యాప్తు చేస్తోందని, ప్రభుత్వ దర్యాప్తు నిష్పాక్షికంగా జరగడం లేదని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో నిందితుడు జనార్ధన్ రావు అరెస్టు కాకముందు జోగి రమేశ్ పేరు ఎక్కడా ప్రస్తావించలేదని, కానీ ఆ తర్వాత మాత్రం నిందితుడిగా చేర్చి అరెస్టు చేసారని తెలిపారు. జోగి రమేశ్ ను ఇరికించేందుకే ఉద్దేశపూర్వకంగా జనార్ధన్ రావుతో వీడియో రిలీజ్ చేయించి, కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు.

మరోవైపు ప్రభుత్వం తరఫున ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పిటిషనర్ అయిన జోగి రమేశ్ ఇప్పటికే నిందితుడిగా అరెస్టు అయ్యారని గుర్తుచేశారు. నిందితులకు విచారణ సంస్థల్ని ఎంచుకునే హక్కు లేదన్నారు. ఈ మేరకు గత తీర్పులు ఉన్నాయని హైకోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన పొన్నవోలు దర్యాప్తు పక్షపాతంగా ఉంటే సీబీఐ విచారణ కోరే అవకాశం ఉంటుందన్నారు. పౌరుల హక్కు అయిన నిష్పాక్షిక దర్యాప్తు జరగనప్పుడు కోర్టుల్ని ఆశ్రయించవచ్చన్నారు. దీంతో హైకోర్టు ప్రభుత్వం అభిప్రాయం కోరుతూ నోటీసులు ఇచ్చింది.












Click it and Unblock the Notifications