బంగాళాఖాతంలో అల్పపీడనం- 26 నాటికి తీవ్ర వాయుగుండంగా- ఏపీకి భారీ వర్షాలు
Heavy rains: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావం వల్ల కొద్దిరోజులుగా ఏపీలో భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో దంచికొట్టాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు విస్తారంగా వర్షలు పడ్డాయి. ప్రత్యేకించి- కోస్తా జిల్లాలపై దీని తీవ్రత అధికంగా కనిపించింది. చెరువులు, కుంటలు జలకళను సంతరించుకున్నాయి. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీ లక్షల క్యూసెక్కుల మేర వరద నీటిని డిశ్చార్జ్ చేశాయి.
ఇప్పుడు తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతోంది. ఈ నెల 24వ తేదీ నాటికి బంగాళాఖాతం ఆగ్నేయ ప్రాంతంలో ఈ అల్పపీడనం ఏర్పడటానికి వాతావరణం అనుకూలంగా ఉంది. 3.2 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడి 24వ తేదీ నాటికి అల్పపీడనంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశాలు లేకపోలేదని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

దీని ప్రభావంతో ఏపీవ్యాప్తంగా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి- ఏపీ దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లాలు బాపట్ల, ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య రాయచోటిల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చు. ఈ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఆవిర్భవించిన తర్వాత అటు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం, అనకాపల్లి, కోనసీమ, శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం పైనా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి.
ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు తిరోగమిస్తోన్నాయి. క్రమంగా ఈశాన్య రుతుపవనాలు విస్తరిస్తోన్నాయి. దక్షిణాదిపై దీని ప్రభావం అధికంగా ఉంటోంది. ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. తమిళనాడు, కేరళ, కర్ణాటకల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులోని తూత్తుకుడి, కోయంబత్తూర్, రామనాథపురం, రామేశ్వరం వంటి జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది.
ఆగ్నేయ అరేబియా సముద్రంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం.. అల్పపీడనంగా, అనంతరం వాయుగుండంగా మారొచ్చు. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం అంచనా వేసింది. ఉత్తర తెలంగాణ జిల్లాలు, దానికి ఆనుకుని ఉన్న ఛత్తీస్ గఢ్ పై ఈ వాయుగుండం ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications