జగన్ సర్కారుకు షాక్: పోలవరం ఆపాలంటూ సుప్రీంకోర్టుకు ఒడిశా, ఏపీవీ తప్పుడు అంచనాలంటూ..
న్యూఢిల్లీ/అమరావతి: ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి షాక్ తగిలింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు నిలిపివేయాలంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 71 పేజీల అఫిడవిట్‌ను న్యాయస్థానానికి సమర్పించింది.

ఒడిశాకు తీవ్ర నష్టం..
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే తమకు తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఒడిశా ప్రుభుత్వం కోర్టుకు వివరించింది. పోలవరం ముంపు విషయంలో స్పష్టత లేదని, ప్రాజెక్టు వద్ద గరిష్ట వరద ప్రవాహం ఏపీ చెప్పినదాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని ఒడిశా వాదించింది.

ఏపీ లెక్కలు తప్పని తేలింది..
ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేస్తూ 2018, జులై 10, ఆ తర్వాత 2019, జూన్ 27 తేదీల్లో జారీ చేసిన ఉత్తర్వులపై రద్దు చేయాలని ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును అభ్యర్థించింది.
ట్రైబ్యునల్‌కు ఏపీ సర్కారు సమాచారం ఇచ్చినట్లుగా.. పోలవరం వద్ద గోదావరి వరద ప్రవాహం 36 లక్షల క్యూసెక్కులు కాకుండా 50 లక్షల(14లక్షల క్యూసెక్కులు ఎక్కువ) క్యూసెక్కుల వరకు ఉంటుందని ఒడిశా వివరించింది. రూర్కీ ఐఐటీ సర్వే ప్రకారం గోదావరిలో గరిష్టంగా 58 లక్షల క్యూసెక్కుల వరకు వరద వచ్చే అవకాశం ఉందని ఒడిశా సర్కారు వాదనలు వినిపించింది. అదే జరిగితే ఒడిశా పరిధిలోని శబరి, సీలేరు ప్రాంతాల్లో 200 అడుగులకుపైగా ముంపు తలెత్తుతుందని, అంత వరద ప్రవాహాన్ని పోలవరం డ్యాం తట్టుకోలేదని స్పష్టం చేసింది.

ముంపు గ్రామాలు తగ్గించారు..
అంతేగాక, పోలవరం ముంపు గ్రామాల సంఖ్యను 2005లో 412గా పేర్కొనగా.. 2017, మే నాటికి ముంపు గ్రామాల సంఖ్య 371కి తగ్గిందని.. ముంపు గ్రామాలపై స్పష్టత లేదని ఒడిశా ఆరోపించింది. తమకు జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది. పూడిక వల్ల భవిష్యత్తులో బ్యాక్ వాటర్‌తో నష్టం మరింత పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. గరిష్ట వరదను లెక్కించడానికి బ్యాక్ వాటర్ స్టడీ చేయించాలని కోరింది.

ఆ ఒప్పందంపై సంతకం చేయలేదు..
మొదట్నుంచి కూడా ఒడిశా ప్రభుత్వం పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించి పోలవరంను నిలిపేయాలని మరోసారి కోరింది. మార్చిన డిజైన్లకు అనుగుణంగా తమ భూభాగంలో ముంపు ప్రాంతం పెరిగేందుకు అనుమతిస్తూ ఒడిశా ఏ ఒప్పందంపై సంతకం చేయలేదని ఆ రాష్ట్ర సర్కారు స్పష్టం చసింది. పోలవరం ప్రాజెక్టు కారణంగా తమ రాష్ట్రంలోని 6వేల మంది గిరిజనులపై ప్రభావం పడుతుందని, కేంద్రం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ఒడిశా ఎంపీ సస్మత్ పాత్రా ఇటీవల రాజ్యసభ దృష్టికి తీసుకెళ్లారు.












Click it and Unblock the Notifications