రిషికేశ్వరి మృతి, విద్యార్థుల పరస్పర దాడి: ఒక్కరు చనిపోతే ఇంతనా? ఆ వ్యక్తులు..
గుంటూరు: నాగార్జున విశ్వవిద్యాలయంలో రిషికేశ్వరి మృతి విషయమై ఏపీ ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. దీంతో, ప్రిన్సిపల్ బాబురావును సస్పెండ్ చేసింది. మరోవైపు, రిషికేశ్వరి మృతి ఘటన పైన జరుగుతున్న బహిరంగ విచారణ ఉద్రిక్తతకు దారి తీసిన విషయం తెలిసిందే.
విశ్వవిద్యాలయంలో విద్యార్థులు ప్రిన్సిపల్ అనుకూలం, ప్రిన్సిపల్ వ్యతిరేక వర్గంగా చీలిపోయారు. ఒకరి పైన మరొకరు దాడులు చేసుకున్నారు. ప్రిన్సిపల్ విద్యార్థినీలతో లేట్ నైట్ పార్టీలు చేసేవారని ఆరోపించారు. యువతులను వేధింపులకు గురి చేసే వారన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అనుకూల, వ్యతిరేక వర్గం మధ్య ఘర్షణ జరిగి పరస్పరం దాడులకు దిగే వరకు వెళ్లింది. ప్రిన్సిపల్‌కు అనుకూలంగా కొందరు, వ్యతిరేకంగా కొందరు నినాదాలు చేశారు.
విశ్వవిద్యాలయంలో కుల రాజకీయాలే జరుగుతున్న ఘటనలకు, దారుణాలకు కారణమని కొందరు మండిపడుతున్నారు. ఇరువర్గాలుగా విడిపోయి దాడికి పాల్పడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు.

మీడియా హడావుడి వల్లనే బాబురావును సస్పెండ్ చేశారని, ఒక్క విద్యార్థి చనిపోతే ఇంత హడావుడి చేస్తారా అంటూ ఆయన మద్దతుదారులు రెచ్చిపోయారని సమాచారం. మీడియా పైన కూడా దౌర్జన్యానికి దిగారు.
ప్రిన్సిపల్ కొంతమంది విద్యార్థులను రెచ్చగొట్టి నిజాలు బయటకు రాకుండా చేస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు. రిషికేషి ఆత్మహత్య కేసులో బయటకు రావాల్సిన వ్యక్తులు చాలామంది ఉన్నారని, పూర్తిస్థాయి దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు. ఆమె కుటుంబానికి న్యాయం జరగాలన్నారు.












Click it and Unblock the Notifications