ఉచిత బస్సు ప్రయాణాల వేళ ఆర్టీసీకి విద్యార్థుల షాక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఏపీలో అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ముఖ్యంగా మహిళల విషయంలో వారికి మాట ఇచ్చినట్టు ఏపీ ప్రభుత్వం వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వచ్చిన ఈ పథకంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ జోరుగా ప్రయాణాలు చేస్తున్నారు.
బస్సులను ఆపి ధర్నా
జీరో టికెట్ మీద ప్రయాణాలు చేస్తున్న మహిళలు ఆర్టీసీ అందిస్తున్న సేవల పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఆర్టీసీ సేవలు సరిగ్గా లేవని విద్యార్థులు ఆర్టీసీ బస్సులను రోడ్డుపైన ఆపి ధర్నా చేయడం ఏపీలో ఆసక్తిగా మారింది. విజయనగరం జిల్లా వంగర మండలం అరసాడ గ్రామంలో విద్యార్థులు బస్సులు సమయానికి రావడంలేదని బస్సుల కొరత పైన ఆగ్రహం వ్యక్తం చేశారు.

బస్సుల కోసం నిరసనతో ట్రాఫిక్ జామ్
సరైన సమయంలో బస్సులు రాక తాము పాఠశాలలకు కళాశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపైన బస్సులను ఆపి నిరసన వ్యక్తం చేశారు. అరసాడ గ్రామంలో కొద్దిసేపు దీంతో ట్రాఫిక్ జామ్ నెలకొంది. విద్యార్థులు పాఠశాలకు వెళ్లడానికి బస్సులు సరైన సమయంలో రాకపోవడమే కాకుండా, బస్సుల్లో ప్రయాణికుల రద్దీ కూడా విపరీతంగా ఉంటుందని, తమకు ప్రత్యేకమైన బస్సును ఏర్పాటు చేస్తే బాగుంటుందని విద్యార్థులు అడుగుతున్నారు.
ఆటోలలో డబ్బులు ఖర్చు.. బస్సులు కావాలన్న విద్యార్థులు
మహిళల కోసం ఉచిత బస్సులు ఇస్తున్న ఏపీ ప్రభుత్వం విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోవలసిన అవసరం ఉందని వారు అంటున్నారు. విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని చెబుతున్న ఏపీప్రభుత్వం వారి సమయానికి పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లేలా బస్సులను ఏర్పాటు చేస్తే సంతోషిస్తామని అంటున్నారు. ప్రతిరోజు బస్సులు రాకపోవడంతో ఆటోలలో వెళ్లడానికి తమకు అనవసరంగా డబ్బులు ఖర్చు అవుతున్నాయని, దయచేసి తమ ఇబ్బందులు పట్టించుకోని బస్సులను ఏర్పాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్
ఒక విజయనగరం జిల్లాలోని గ్రామాలలోని విద్యార్థులు మాత్రమే కాదు, ఉచిత బస్సుల ప్రభావంతో అన్ని జిల్లాలలోనూ విద్యార్థులు బస్సులలో ప్రయాణం సాగిస్తున్నారు. దీంతో పాఠశాలలకు వెళ్లడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనుక విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీ తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications