వివాదాల వేళ.. ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జి?
ఏపీ, తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల హైకోర్టులకు సుప్రీంకోర్టు కొలీజియం కొత్త న్యాయమూర్తులను సిఫారసు చేసింది. సలువురు న్యాయమూర్తుల బదిలీకి సిఫారసులు ఇచ్చింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనలను వేర్వేరుగా విడుదల చేసింది. ఈ సిఫారసుల నేపథ్యంలో ఏపీ, తెలంగాణ హైకోర్టులకు కొత్త న్యాయమూర్తులు రానున్నారు.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలో న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్ నాథ్‌తో కూడిన కొలీజియం ఈ మేరకు ఈ నియామకాలను సిఫారసు చేసింది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. న్యాయ మంత్రిత్వ శాఖ వీటిని ఆమోదించాల్సి ఉంటుంది.

సీనియర్ అడ్వొకేట్ గేదెల తుహిన్ కుమార్ ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫారసు చేసిందీ కొలీజియం. జూలై 1వ నాటికి ఏపీ హైకోర్టుకు మొత్తం 37 మంది న్యాయమూర్తుల పోస్టులు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం 28 మంది న్యాయమూర్తులు ఇక్కడ విధులను నిర్వర్తిస్తోన్నారు. తొమ్మిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
ఈ తొమ్మిదింట్లో ఒక పోస్టును భర్తీ చేయడానికి గేదెల తుహిన్ కుమార్ పేరును సుప్రీంకోర్టు కొలీజియం.. కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అలాగే- మరో నలుగురు సీనియర్ అడ్వొకేట్లు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమితులు కానున్నారు.
ఈ నలుగురిలో గౌస్ మిరా మొహియుద్దీన్, సుద్దాల చలపతిరావు, వాకిటి రామకృష్ణారెడ్డి, గాడి ప్రవీణ్ కుమార్ ఉన్నారు. తెలంగాణ హైకోర్టుకు మొత్తం మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 42. ప్రస్తుతం 26 మందే ఇక్కడ విధి నిర్వహణలో ఉంటోన్నారు. దీంతో ఖాళీల భర్తీ ప్రక్రియను సుప్రీంకోర్టు కొలీజియం చేపట్టింది. న్యాయమూర్తులుగా ఈ నలుగురిని నియమించాలని సిఫారసు చేసింది.












Click it and Unblock the Notifications