ఎర్ర గంగిరెడ్డి కేసు: హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే
ఎర్ర గంగిరెడ్డి బెయిల్ వ్యవహారంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. గంగిరెడ్డి విడుదలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం స్టే ఇచ్చింది. బెయిల్ మంజూరు చేయడంతో పాటు కస్టడీ తర్వాత ఎర్ర గంగిరెడ్డి విడుదల తేదీని ఖరారు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వివేకా కుమార్తె సునీత సుప్రీంలో సవాల్ చేశారు. దీనిపై జస్టిస్ పీఎస్ నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి ఆదేశాలు జారీ చేసింది.
నేపథ్యమిదీ : ఎర్ర గంగిరెడ్డి కేసుకు సంబంధించి హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె సునీత నర్రెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ పంకజ్ మిత్తల్‌లతో కూడిన వేసవి సెలవుల ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది. సీబీఐ తరఫున ఏఎస్ జీ సంజయ్ జైన్ వాదనలు వినిపించారు. వివేకా హత్య కేసులో ఏ1 గా ఉన్న గంగిరెడ్డిని బెయిల్ రద్దుచేసి లొంగిపోవాలంటూ జులై ఒకటోతేదీన విడుదల చేయాలంటూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు ప్రపంచంలో 8వ వింతను తలపిస్తున్నాయన్నారు. ఇలాంటివి తామెన్నడూ వినలేదన్నారు. సునీత దాఖలు చేసిన పిటిషన్ ను సమర్థిస్తున్నట్లు తెలిపారు.

తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని కోరారు. తాము కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేస్తామన్నారు. గంగిరెడ్డి తరఫు న్యాయవాది దామా శేషాద్రినాయుడు వాదనలు వినిపించారు. తాము కూడా బెయిల్ రద్దును సవాల్ చేస్తూ ఎస్ ఎల్పీ దాఖలు చేసినట్లు తెలిపారు. అయితే అది లిస్టు కావాల్సి ఉందని, దాన్ని కూడా కలిపి విచారించాలని కోరారు. జస్టిస్ నరసింహ రెండు కేసులనూ శుక్రవారానికి వాయిదా వేశారు. ఆ కేసును విచారించిన ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది.












Click it and Unblock the Notifications