జగన్ పై మేకపాటి తీవ్ర వ్యాఖ్యలు-నమస్కారం కూడా చేయడు-ఎమ్మెల్సీ వద్దన్నా-ఇంకేం 175 ?
నెల్లూరు : ఏపీలో తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆరోపణలపై సస్పైండైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (mekapati chandrasekhar reddy) క్రమంగా బయటపడుతున్నారు. వైసీపీ నిలబెట్టిన అభ్యర్ధికే ఓటు వేశానంటూ చెబుతూ వస్తున్న ఆయన ఇవాళ అదే వైసీపీపై ప్రత్యక్ష మాటల దాడికి దిగారు.
ఎమ్మెల్యేలకు జగన్ సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. సీనియర్లను కనీసం గౌరవించే సంస్కృతి లేదన్నారు. నమస్కారానికి ప్రతి నమస్కారం కూడా చేయరంటూ జగన్ పై తీవ్ర ఆరోపణ చేశారు. రాజశేఖర్‍రెడ్డి వద్ద ఉండే గౌరవ మర్యాదలు జగన్ వద్ద లేవన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనని, ఎమ్మెల్సీ ఇస్తామన్నారని జగన్ తో భేటీ సందర్భంగా జరిగింది చెప్పేశారు. ఎమ్మెల్సీ అవకాశం తనకు వద్దని జగన్‍కు చెప్పానన్నారు.

ఎవరో సలహాదారుల్ని ఎమ్మెల్యేలపై పెట్టడం ఏంటని ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. సలహాదారులు జగన్‍కు ఇచ్చే సలహాలు ఏంటని నిలదీశారు. వైసీపీలో 40 నుంచి 50 మంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారన్నారు. వైనాట్ 175 అనడానికి జగన్‍కు ఉన్న ధైర్యం ఏంటో అని ప్రశ్నించారు. ఏదో బటన్లు నొక్కి అంతా బాగుందని అనుకుంటున్నారని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆక్షేపించారు. ఉద్యోగులకు జీతాలివ్వకపోవడం చాలా ప్రమాదకరమన్నారు.
బిల్లులు రాక కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితులు ఉన్నాయని ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యేల్ని గౌరవించని పార్టీలు మూసుకోవాల్సిందేనన్నారు. సీఎం అనుకుంటే ఆయన పక్కనున్నవాళ్లూ నమస్కారం పెట్టరన్నారు. తద్వారా వైసీపీలో తాను ఎంత అసంతృప్తిగా ఉన్నారో ఉదయగిరి ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి బయటపెట్టారు.












Click it and Unblock the Notifications