ఎస్వీబీసీ రీవ్యాంప్: ఆ విషయంలో రాజీపడొద్దు: టీటీడీ ఈఓ ఆదేశాలు
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఇక మరింత ఆధునికీకరణకు నోచుకోనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించేలా ఎస్వీబీసీ ఛానల్ కార్యక్రమాలను సృజనాత్మకంగా రూపొందించేలా చేయాలని టీటీడీ నిర్ణయించింది. తమ పరిధిలోని అన్ని ఆలయాలకు సంబంధించిన చరిత్రను ఈ తరానికి తెలియజేసేలా కార్యక్రమాలు రూపొందించనుంది.
టీటీడీ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర ఎస్వీబీసీ కార్యాలయాన్ని సందర్వించారు. రోజువారీ ప్రసారాలు, భవిష్యత్ కార్యక్రమాల రూపకల్పనపై సమీక్ష నిర్వహించారు. ఎస్వీబీసీ సీఈవో, టీటీడీ జేఈవో డాక్టర్ ఎ శరత్ ఇతర అధికారులతో ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు. తిరుమలలోని స్థూపాలు, మండపాలు, ప్రాకారాలు, తీర్థాలు, ఉపాలయాలు, శ్రీవారి ప్రసాదాల విశిష్టత తదితర అంశాలను భక్తులకు సులభంగా అర్థమయ్యేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు.

తిరుమల ఆధ్యాత్మిక వైభవం, శ్రీవారి మహిమను ప్రతి భక్తుడి హృదయానికి చేరేలా ఆకర్షణీయమైన కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఎస్వీబీసీని వీక్షిస్తున్నారని, ప్రతి కార్యక్రమం భక్తులను చివరి వరకు ఆసక్తిగా చూసేలా ఉండాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తి, భావం, సరళత కలగలిపిన కార్యక్రమాలతో రోజురోజుకు ప్రేక్షకాదరణ పెరిగేలా కొత్త ఆలోచనలకు ప్రాధాన్యత ఇవ్వాలని ముద్దాడ రవిచంద్ర అన్నారు.
ప్రస్తుతం ప్రసారమవుతున్న కార్యక్రమాలను సమీక్షించి, భక్తుల అభిరుచికి అనుగుణంగా మరిన్ని వినూత్నమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలను రూపొందించాలని అధికారులను ఈఓ ఆదేశించారు. హెచ్‌డీపీపీ సహకారంతో ప్రారంభించిన మహాలక్ష్మీ దీపపూజ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని, దీనిని గ్రామీణ స్థాయి వరకు విస్తరించడానికి ప్రణాళికలను రూపొందించుకున్నట్లు శరత్ తెలిపారు.
రానున్న శ్రీ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేశంలోని ప్రముఖ కళాకారులతో ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఈఓ.. స్టూడియోలోని ఆధ్యాత్మిక విశేషాలు, ఎడిటింగ్ సెక్షన్ వంటి విభాగాలను పరిశీలించారు. ఆయా సెక్షన్లు, విభాగాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. కొన్ని సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications