కొలికపూడి Vs కేశినేని చిన్ని- క్లైమాక్స్ సీన్..!!
తిరువూరు పంచాయితీకి ముగింపు రానుంది. సీఎం చంద్రబాబు ఈ పంచాయితీ పైన సీరియస్ గా ఉన్నారు. ఎంపీ కేశినేని చిన్ని- ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య కొంత కాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. టీవీ చర్చల్లో.. సోషల్ మీడియాలో కొలికపూడి చేసిన అవినీతి ఆరోపణల పైన పార్టీ ఆగ్రహంగా ఉంది. ఈ ఇద్దరి వివాదం ముగించేందుకు కఠిన చర్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో ఈ ఇద్దరికీ పార్టీ నుంచి పిలుపు రావటంతో.. తదుపరి చర్యల పై ఉత్కంఠ కొనసాగుతోంది.
తిరువూరు పంచాయితీ తేల్చేందుకు సీఎం చంద్రబాబు సిద్దమయ్యారు. ఎంపీ చిన్ని - ఎమ్మెల్యే కొలికపూడిని ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. టికెట్లు ఇచ్చే సమయంలోనే ఇలాంటి వారి గురించి ఆలోచించాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ బొమ్మతో గెలిచిన వీరు సొంతం గా గెలిచామన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. అలా అనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని తేల్చేసారు. ఈ సమయంలోనే ఇద్దరితో మాట్లాడి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమ శిక్షణా కమిటీకి సూచించారు. దీంతో.. ఈనెల 4న ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందుకు రావాలని కొలికపూడికి, అదే రోజు సాయంత్రం 4 గంటలకు రావాలని చిన్నికి సమాచారం అందించింది.

రేపు (మంగళవారం) 4వ తేదీ ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావా లని కొలికపూడి శ్రీనివాస్ కు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు తమ ముందు హాజరు కావాలని కేశినేని చిన్నికి క్రమశిక్షణ కమిటీ సమా చారం పంపింది. క్రమశిక్షణ కమిటీలో మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, షరీఫ్, కొనకళ్ల నారాయణ ఉన్నారు.
గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని రూ.5కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంకు స్టేట్‌మెంట్లు ఇవే అంటూ తన వాట్సప్ స్టేటస్‌లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్‌లో పోస్టు చేయటం సంచలనంగా మారింది.
అదే విధంగా ఎంపీ చిన్ని సైతం కొలికపూడి వ్యాఖ్యల పై ఘాటుగా స్పందించారు. తాను వైసీపీ నేతలతో అంటకాగే నాయకుడిని కానన్నారు. నిఖార్సైన టీడీపీ నాయకుడినని చెప్పారు. 12 నెలల వరకు నన్ను దేవుడు అన్నాడు, ఇప్పుడు దెయ్యం అని ఎందుకంటున్నాడో కొలికపూడినే సమాధానం చెప్పాలన్నారు. కాగా.. కొన్నాళ్లుగా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల గొడవలు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారాయి. టీడీపీలో క్రమశిక్షణ కట్టు తప్పుతోందన్న ప్రచారంపై అధినాయ కత్వం సీరియస్ గా ఉంది. ఇక మీదట ఎవరైనా గీత దాటితే అసలు సహించేది లేదని చంద్రబాబు హెచ్చరించారు. దీంతో.. ఇప్పుడు క్రమశిక్షణా కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా సీఎం చంద్రబాబు తీసుకునే చర్యల పైన ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications