వైసీపీ గర్జనతో డిఫెన్స్ లో టీడీపీ ? అదే రోజు ఉత్తరాంధ్ర నేతల భేటీ-విశాఖకు చేసింది చెప్పేందుకే !
ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతున్న రాజకీయాలు కాస్తా ఇప్పుడు అమరావతి వర్సెస్ మూడు రాజధానుల బలప్రదర్శనలుగా మారిపోయాయి. ముఖ్యంగా అమరావతిలోనే రాజధాని కోరుతూ రైతులు చేపట్టిన పాదయాత్రను నడిపిస్తున్న టీడీపీకి కౌంటర్ ఇచ్చేందుకు వైసీపీ విశాఖలో వికేంద్రీకరణ గర్జన నిర్వహిస్తోంది. ఈ నెల 15న భారీ ఎత్తున నిర్వహిస్తున్న ఈ గర్జన ద్వారా మూడు రాజధానులపై జనంలో అవగాహన కల్పించేందుకు ప్రయత్నిస్తుండగా.. అదే రోజు విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతలతో కీలక సమావేశం నిర్వహించబోతోంది.

విశాఖలో వైసీపీ గర్జన
విశాఖలో ఈ నెల 15న వైసీపీ ఆధ్వర్యంలో నాన్-పొలిటికల్ జేఏసీ రూపంలో వికేంద్రీకరణ గర్జన జరగబోతోంది. దీనికి వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులు, కీలక నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వికేంద్రీకరణ గర్జన పేరుతో విశాఖ నగరంలో భారీ ర్యాలీ నిర్వహించి మూడు రాజధానులపై జనంలో అవగాహన కల్పిస్తామని వైసీపీ నేతలు చెప్తున్నారు. దీన్ని వైసీపీ అధిష్టానం సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఆ మేరకు సక్సెస్ చేసేందుకు క్షేత్రస్దాయిలో నేతలు శ్రమిస్తున్నారు.

ఆత్మరక్షణలో టీడీపీ !
విశాఖలో వైసీపీ నిర్వహించబోతున్న వికేంద్రీకరణ గర్జన ఇప్పుడు టీడీపీకి సంకటంగా మారింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు రాజధాని వస్తుంటే వ్యతిరేకిస్తున్నారన్న అప్రతిష్టను టీడీపీ మూటగట్టుకుంటోంది. దీంతో సహజంగానే తమ్ముళ్లు ఆత్మరక్షణలో పడుతున్నారు. దశాబ్దాలుగా విశాఖపై తమకున్న పట్టు మూడు రాజధానుల వ్యవహారంతో చేజారుతుందనే భయం టీడీపీలో కనిపిస్తోంది. దీనికి తోడు వైసీపీ విశాఖ గర్జన నిర్వహణతో ఉత్తరాంధ్రలో ఇబ్బందులు తప్పవనే భావన టీడీపీలో వ్యక్తమవుతోంది. అందుకే ఇప్పుడు దీన్ని అధిగమించేందుకు టీడీపీ ప్రత్యమ్నాయ మార్గాలపై దృష్టిపెట్టింది.

గర్జనకు పోటీగా టీడీపీ ఉత్తరాంధ్ర భేటీ
వైసీపీ విశాఖలో వికేంద్రీకరణ గర్జన నిర్వహించే అక్టోబర్ 15న తాము కూడా అమరావతి రాజధానిపై గళం వినిపించాలని ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు నిర్వహించారు. ఇందులో భాగంగా అక్టోబర్ 15న విశాఖకు రావాలని ఉత్తరాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు టీడీపీ ఆహ్వానం పంపుతోంది. వైసీపీ గర్జన రోజు విశాఖలో కీలక సమావేశం నిర్వహించడం ద్వారా సత్తా చాటాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ సదస్సు ద్వారా వైసీపీకి గట్టి కౌంటర్ ఇవ్వాలనేది టీడీపీ వ్యూహం.

టీడీపీ సమావేశం లక్ష్యమిదే ?
వైసీపీ వికేంద్రీకరణ గర్జన రోజే విశాఖలో టీడీపీ ఉత్తరాంధ్ర నేతల భేటీ కీలకంగా మారింది. ఈ సమావేశం ద్వారా విశాఖకు టీడీపీ చేసిన అభివృద్దిని ప్రజలకు చెప్పాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ముఖ్యంగా విశాఖలో ఐటీ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వాల పుణ్యమేనని చెప్పేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు. అలాగే హుద్ హుద్ తుఫాన్ సమయంలో ఇక్కడే పాగా వేసి చంద్రబాబు నిర్వహించిన సహాయక చర్యలు, విశాఖ అభివృద్దిలో చంద్రబాబు పాత్రను ప్రజలకు ఈ సమావేశం ద్వారా వివరించాలని టీడీపీ భావిస్తోంది. దీంతో అక్టోబర్ 15న విశాఖలో వైసీపీ వర్సెస్ టీడీపీ పోరుగా మారబోతోంది.












Click it and Unblock the Notifications