Anakapalle: అనకాపల్లి సీటు మార్చుకుంటున్న టీడీపీ, జనసేన ?
ఏపీలోని ఉమ్మడి విశాఖ జిల్లాలో భాగమైన అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గంలో అభ్యర్ధుల విషయంలో టీడీపీ,జనసేన మార్పులకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన ఉమ్మడిగా ప్రకటించిన అభ్యర్ధుల జాబితాలో ఎంపీ సీటు ఆశించిన సీనియర్ నేత కొణతాల రామకృష్ణకు అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్ధిగా ఎంపిక చేశారు. అయితే ఇప్పుడు ఆయన్ను తిరిగి ఎంపీ అభ్యర్ధిగా మార్చేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.
కాపులు, బీసీలు ఎక్కువగా ఉన్న నియోకవర్గమైన అనకాపల్లి లోక్ సభ సీటు పరిధిలో ఉన్న అనుకూల పరిస్దితుల్ని సొమ్ము చేసుకునేందుకు టీడీపీ, జనసేన ముందునుంచీ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా జనసేన కీలక నేత నాగబాబు అనకాపల్లి ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం అప్పటికే పార్టీలో చేరి అదే సీటు ఆశిస్తున్న కొణతాల రామకృష్ణను బుజ్జగించడం మొదలుపెట్టారు. చివరికి పవన్, నాగబాబు ఇద్దరూ కలిసి కొణతాలను ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఒప్పించేశారు. దీంతో అభ్యర్ధుల తొలి జాబితాలోనే కొణతాల పేరు వచ్చేసింది.

అయితే అక్కడే ట్విస్ట్ ఎదురైంది. అనకాపల్లి అసెంబ్లీ సీటును ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ విశాఖ జిల్లాలో తనకు మద్దతుగా ఉన్న సీనియర్ నేతల సాయంతో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇవాళ కూడా జిల్లాలో ఇతర నేతలతో కలిసి చంద్రబాబును కలిసిన పీలా గోవింద్ అనకాపల్లి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాలని కోరారు. దీంతో పవన్ ను ఒప్పించి కొణతాల రామకృష్ణను అనకాపల్లి ఎంపీగా పంపి, ఎమ్మెల్యే సీటులో టీడీపీ అభ్యర్ధిగా పీలా గోవింద్ తో పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.












Click it and Unblock the Notifications