నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నిలిపివేత..!!
టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర తాత్కాలికంగా నిలిపివేసారు. ప్రస్తుతం రాజోలు నియోకవర్గంలో లోకేశ్ యాత్ర కొనసాగుతోంది. శనివారం ఉదయం టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ సమాచారం అందటంతో లోకేశ్ యాత్ర నిలుపుదల చేసారు. వెంటనే చంద్రబాబు వద్దకు వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ తరువాత అనుమతి ఇవ్వటంతో విజయవాడ చేరుకున్న లోకేశ్ కుటుంబ సభ్యులతో పాటుగా చంద్రబాబును కలిసారు.
తెలుగు దేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ తో ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్కిల్ స్కాంలో చంద్రబాబు ప్రమేయం పైన సీఐడీ ప్రధానంగా అభియోగాలు నమోదు చేసింది. నంద్యాల నుంచి విజయవాడకు తరలించిన తరువాత చంద్రబాబును సీఐడీ దాదాపు పది గంటల పాటు విచారణ చేసింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేశ్ ,బాలయ్య, బ్రాహ్మణిలు విచారణ కార్యాలయం లో చంద్రబాబును కలిసారు. శుక్రవారం సాయంత్రం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలోకి లోకేశ్ యాత్ర ప్రవేశించింది.

రాజోలు మండలం పాదలాడలో లోకేశ్ బస చేసారు. చంద్రబాబు అరెస్ట్ సమాచారంతో యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. తన తండ్రి చంద్రబాబును కలిసేందుకు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వకపోవటం పైన లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆ తరువాత అనుమతి లభించటంతో విజయవాడకు చేరుకున్నారు. తిరిగి పాదయాత్ర ఎప్పుడు ప్రారంభిస్తారనేది స్పష్టత రావాల్సి ఉంది. విజయవాడ చేరుకున్న తరువాత లోకేశ్ తన తండ్రి కేసుకు సంబంధించి న్యాయవాదులతో మంతనాలు సాగించారు. ఈ ఉదయం నుంచి కేసు విచారణ సమయంలో కోర్టు ప్రాంగణంలోనే చంద్రబాబు, న్యాయవాదులతో మంతనాలు సాగించారు. కోర్టు తీర్పుకు అనుగుణంగా లోకేశ్ తన యాత్ర కొనసాగింపు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications