ఫలించని టీడిపీ నేతల చర్చలు: దీక్షపై వెనక్కి తగ్గేది లేదన్న ముద్రగడ

కాకినాడ: నిరవధిక నిరాహార దీక్షను విరమింపజేయడానికి తెలుగుదేశం పార్టీ నేతలు గురువారం రాత్రి ముద్రగడ పద్మనాభంతో జరిపిన చర్చలు ఫలించలేదు. టీడీపి శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రావు గురువారం రాత్రి ముద్రగడ పద్మనాభంతో కిర్లంపూడిలోని ఆయన నివాసంలో చర్చలు జరిపారు.

దీక్ష నుంచి వెనక్కి తగ్గడానికి ముద్రగడ పద్మనాభం తెలుగుదేశం పార్టీ నాయకుల వద్ద కొన్ని షరతులు పెట్టినట్లు తెలుస్తోంది. మంజనాథ్ కమిటీ గడువును తొమ్మిది నెలల నుంచి మూడు నెలలకు కుదించాలనేది ఆయన ప్రధాన డిమాండ్. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు కాపులను బీసీ జాబితాలో చేర్చడానికి కచ్చితమైన హామీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, కాపులకు రెండు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని ఆయన కోరారు.

Mudragada Padmanabham

అయితే, వాటిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు స్పష్టమైన హామీ ఇవ్వలేకపోయారు. తాము ప్రభుత్వం తరఫున రాలేదని టీడీపి నాయకులు చెప్పారు. ముద్రగడ పద్మనాభం చెప్పిన విషయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెప్పి, మరోసారి ఆయనతో భేటీ అవుతామని ఆయన చెప్పారు.

రేపు ఉదయం 9 గంటల నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని తీసుకున్న నిర్ణయంలో మార్పు లేదని ముద్రగడ పద్మనాభం భేటీ అనంతరం చెప్పారు. తన డిమాండ్ల విషయంలో మార్పు లేదని చెప్పినట్లు ఆయన తెలిపారు. డిమాండ్లను నెరవేరిస్తేనే ఉద్యమం విరమిస్తానని ఆయన చెప్పారు. డిమాండ్లను సాధించే వరకు వెనుదిరిగేది లేదని ఆయన చెప్పారు. తుని సంఘటనలపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ఆయన కోరారు. తన దీక్షకు అడ్డు తగలవద్దని తాను టిడిపి నాయకులను కోరినట్లు ఆయన తెలిపారు.

తాను గొంతెమ్మ కోరికలు కోరడం లేదని ఆయన చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలనే నెరవేర్చాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. సస్యను పరిష్కరించడానికి బాధ్యత తీసుకున్న టీడిపి నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాపు ఐక్య గర్జన సందర్బంగా పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ముద్రగడ తాను తీసుకున్న నిర్ణయం మేరకు తన సతీమణితో కలిసి రేపు (శుక్రవారం) ఉదయం కిర్లంపూడిలోని తన నివాసంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగనున్నారు. ప్రభుత్వ స్పందన కోసం వేచి చూడకుండా దీక్ష సాగిస్తానని ముద్రగడ చెప్పారు.

నిరాహార దీక్ష చేస్తే దుష్టశక్తులకు అవకాశం ఇచ్చినట్లవుతుందని, దీక్ష చేయాలనే నిర్ణయాన్నిఉపసంహరించుకోవాలని తాము ముద్రగడను కోరినట్లు తోట త్రిమూర్తులు మీడియాకు చెప్పారు. సున్నితమైన విషయాన్ని జఠిలంగా మారుతుందనే ఆందోళనతో తాము ముద్రగడతో మాట్లాడినట్లు బొండా ఉమామహేశ్వర రావు చెప్పారు. రాష్ట్రంలోని అభిప్రాయాలను ముద్రగడకు చెప్పినట్లు ఆయన తెలిపారు. ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపించకుండా సున్నితమైన అంశాన్ని జఠిలం చేయకుండా పరిష్కారానికి సహకరించాలని కోరామని ఆయన చెప్పారు. ఆరున్నర నెలల్లో మంజనాథ్ కమిషన్ నివేదిక వస్తుందని ఆయన చెప్పారు.

వేయి కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడుతామని ముఖ్యమంత్రి చెప్పిన విషయాన్ని బొండా గుర్తు చేశారు. ముఖ్యమంత్రికి రేపు శుక్రవారం ఉదయం విషయాలు చెప్పి, పరిష్కరించడానికి తాము కృషి చేస్తామని, ముద్రగడ అందుకు సానుకూలంగా ఉన్నారని, ముఖ్యమంత్రి కూడా ముందుకు వస్తారని అనుకుంటున్నామని ఆయన చెప్పారు. వెంటనే జరగాలనడం, గడువులు విధించడం వల్లనే సమస్య వస్తోందని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+