వచ్చే ఎన్నికల్లో టిడిపికి 140 సీట్లు:కళా వెంకట్రావు;వైసీపీకి టు లెట్ బోర్డు:దేవినేని ఉమ
విజయనగరం: వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ 140 సీట్లు గెలిచి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని మంత్రి కళా వెంకట్రావు ధీమా వ్యక్తం చేశారు. విజయ నగరంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటేస్తే...బీజేపీకి ఓటేసినట్లేనని కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. ఈ నెల 6 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని...జగనేమో పాదయాత్రలోనే ఉన్నారని చెప్పారు. జగన్ అసెంబ్లీకి రాకపోగా ఎమ్మెల్యేలను కూడా వెళ్లనీయడం లేదని మంత్రి కళా వెంకట్రావు విమర్శించారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిన అవసరం ప్రతీ ఎమ్మెల్యేపై ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

జగన్...స్వలాభం కోసమే పార్టీ
జగన్ కు ప్రజాస్వామ్యంపై విశ్వాసం లేదని మంత్రి కళా వెంకట్రావు దుయ్యబట్టారు. అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టులాంటిందని అభిప్రాయపడ్డారు. జగన్ తన స్వలాభం కోసమే పార్టీని నడుపుతున్నారని కళా వెంకట్రావు విమర్శించారు.

జగన్ ఓటు వేస్తే...బిజెపికి వేసినట్లే
ప్రధాని మోడీ విభజన హామీలు నెరవేర్చకపోయినా...వైసీపీ మాత్రం వాళ్లతో చీకటి ఒప్పందం చేసుకుని ముందుకెళ్తోందని ఆరోపించారు. అందువల్ల వచ్చే ఎన్నికల్లో వైసిపికి ఓటేస్తే జగన్ కు వేసినట్లే నని ఆయన వ్యాఖ్యానించారు. పాలనాపరంగా రాష్ట్రంలో విద్యుత్ శాఖలో అనేక సంస్కరణలు తెచ్చామని మంత్రి కళా వెంకట్రావు తెలిపారు.

ఒక్కసారి...పోలవరం చూసిరా
మరోవైపు విజయవాడలో మంత్రి దేవినేని ఉమ మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బాధ్యాయుతమైన ప్రతిపక్షంగా విఫలమైందని విమర్శించారు. జగన్ తాను ఇంకా ముఖ్యమంత్రి అవుతాననే భ్రమలో ఉన్నారని, తాను సీఎం అయ్యాక పోలవరం పూర్తిచేస్తానని అజ్ఞానంతో మాట్లాడుతున్నారని మంత్రి ఉమ ఎద్దేవా చేశారు. ఇప్పటికే పోలవరం పనులు 58 శాతం పూర్తయ్యాయని ఆయన తెలిపారు. జగన్ కూడా వెళ్లి ఒకసారి పోలవరం ప్రాజెక్టు చూసి రావాలని మంత్రి ఉమ సూచించారు.

వైసిపికి...టు లెట్ బోర్డ్
రాష్ట్రంలో ఏం జరుగుతుందో జగన్ తెలుసుకోవాలని అన్నారు. వైసిపి పని అయిపోయిందన్నారు. ఈ సందర్భంగా జగన్ ను ఉద్దేశించి మంత్రి దేవినేని మాట్లాడుతూ "జగన్.. నీ దుకాణం మూసెయ్యి...వైసీపీకి టూ లెట్ బోర్డు పెట్టే సమయం వచ్చేసింది'...అని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం అసలు వైసీపీ తరుపున పార్లమెంట్ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. చిలకలూరిపేట, మైలవరం టికెట్‌లను జగన్ ఇప్పటికే అమ్మేశారని మంత్రి దేవినేని ఉమ ఆరోపించారు.












Click it and Unblock the Notifications