ఎమ్మెల్సీ ఎన్నిక వేళ వైసీపీకి మరో షాకిచ్చిన గంటా ! త్వరలో జరిగేది ఇదే..!
విశాఖ కార్పోరేషన్ స్థాయీసంఘం ఎన్నికల్లో కూటమి క్లీన్ స్వీప్ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇవాళ కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గేట్లు తెరిస్తే వైసీపీ ఖాళీయే అన్నారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయం రాష్ట్రంలో ఇకపై జరిగే అన్ని ఎన్నికల్లో గెలుపుకు నాంది అన్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్ధిని త్వరలో ప్రకటిస్తామన్నారు.
విశాఖలో భూ దందాలపై త్వరలో మొత్తం డిటైల్స్ ప్రజల ముందు ఉంచబోతున్నామని ఆయన తెలిపారు. త్వరలో మళ్ళీ మాస్టర్ ప్లాన్ లపై అధ్యాయం చేసి, కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఉత్తరాంధ్ర,విశాఖపట్నంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక అభిమానం ఉందని గంటా తెలిపారు. విశాఖకి ఎన్నో ఏళ్ళ కలగా ఉన్న మెట్రో రైలు త్వరలో రాబోతుందని ఆయన వెల్లడించారు. విశాఖలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ దృష్ట్యా 12 ఫ్లైఓవర్లు ఏర్పాటుచేసేందుకు పరిశీలన చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు కూడా ప్రారంభం కాబోతోందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్ధితిపై ఇప్పటికే ఏడు శ్వేతపత్రాలు విడుదల చేసినట్లు తెలిపారు.

మరోవైపు వాలంటీర్ల ప్రమేయం లేకుండా రెండో నెల కూడా పెన్షన్స్ విజయవంతంగా అందజేశామని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ తెలిపారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమేనని, ప్రతిపక్ష నేత కాదన్నారు. సాధారణ శాసన సభ్యుడు అయిన జగన్ కు మాజీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీ లో అన్ని ప్రోటోకాల్స్ కల్పించి గౌరవం ఇచ్చిన గొప్పతనం తమదేనన్నారు. గతంలో టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేల్లో కొంతమందిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష నేత హోదా పోతుందని జగన్ అన్న విషయం గుర్తుచేశారు.












Click it and Unblock the Notifications