బాబుకు మరో షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే మైనంపల్లి
హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మరో శాసనసభ్యుడు తెరాసలోకి వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు తెరాసలో చేరే అవకాశాలు న్నాయని తెలిసింది. మెదక్ జిల్లా టిడిపి అధ్యక్షునిగా వున్న హనుమంతరావు గత సాధారణ ఎన్నికలలో రామాయంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టిడిపి టికెట్‌పై ఎన్నికయ్యారు.
ఇప్పటికే రంగారెడ్డి జిల్లా టిడిపి అధ్యక్షుడు, ఎమ్మెల్యే పి.మహేందర్‌రెడ్డితో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎల్లారెడ్డి, కె.ఎస్.రత్నం తెరాసలో చేరారు. తాజాగా అదే బాటలో మైనంపల్లి హనుమంతరావు కూడా పయనిస్తున్నట్టు సమాచారం. హనుమంతరావు తెరాసలో చేరితే మెదక్ జిల్లాలో కీలక బాధ్యతలు అప్పగిస్తామనే ప్రతిపాదన చేస్తున్నట్టు తెలిసింది.

ఇటివల జరిగిన రాజ్యసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థి పేరును ప్రతిపాదించి ఒక దశలో పార్టీ అధినేతకు వివరణ ఇచ్చుకున్నారు. హనుమంతరావు నగర శివార్లలోని మల్కాజిగిరి అసెంబ్లీ సీటును టిడిపి తరపున ఆశించారు. అయితే టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు ఎటూ తేల్చకపోవడంతో తెరాసలోకి వెళ్లాలనే యోచనలో వున్నట్టు తెలుస్తోంది.
స్థానికంగా బి.సి. సామాజికవర్గానికి చెందిన నేత వి.కె.మహేష్ ముదిరాజ్ వైపు చంద్రబాబునాయుడు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీమాంధ్రలో కాంగ్రెసు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరుతున్న క్రమంలో తెలంగాణలో మాత్రం ఆ పార్టీ నుంచి వలసలు పెరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications