ఆ విషయంలో తగ్గేదేలే: నారా లోకేష్
ఇండియా కూటమి తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి పదవిని ఇస్తామన్నా జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీయే)లోనే ఉంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఎంత స్నేహపూర్వకంగా ఉన్నామో నరేంద్రమోడీతోను అలాగే ఉంటామని పునరుద్ఘాటించారు. ఇండియాటుడే తరఫున రాజ్ దీప్ సర్దేశాయ్ నారా లోకేష్ ను ఇంటర్వ్యూ చేశారు. ఇండియా కూటమి తమను ఆహ్వానించినా ఆ విషయంలో పునరాలోచనే లేదని తేల్చిచెప్పారు.
షరతులు విధించలేదు
తమకు పదవులు ముఖ్యం కాదని.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని .. చంద్రబాబు పిలుపునిచ్చినట్లుగా స్టేట్ ఫస్ట్ నినాదంతో ఏపీని అభివృద్ధి చేసేందుకు పాటుపడతామని తెలిపారు. తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కింగ్ మేకర్ కావడంతో మోడీ కేబినెట్ లో కీలక పదవులను ఆశిస్తోందంటూ వార్తలు వస్తున్నాయని, దీనిపై అభిప్రాయం కోరగా తమకు ఫలానా మంత్రి పదవులు కావాలంటూ బీజేపీ ముందు షరతులు విధించలేదని, ఎలాంటి షరతులు లేకుండానే తాము కేంద్రంలో ఆ పార్టీకి మద్దతిస్తున్నామన్నారు.

20 లక్షల ఉద్యోగాలిస్తాం
పదవుల కోసం రాజీపడి ఏపీ అభివృద్ధిని మరిచిపోమని, అభివృద్ధితోపాటు సంక్షేమమే తమ అజెండా అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఇచ్చిన హామీని తప్పకుండా నెరవేరుస్తామన్నారు. యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రాధాన్యంగా ఉంటుందన్నారు. వైసీపీ ఓటమితో మూడు రాజధానుల ముచ్చటకు శుభం కార్డు పడిందని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని అది అమరావతి అని స్పష్టం చేశారు.
మూడు రాజధానులన్న వైసీపీ
వైసీపీకి ముందు అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి నిర్మాణాలు మొదలుపెట్టింది. తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ మూడు రాజధానులన్నారు. వైజాగ్, కర్నూలు, అమరావతి రాజధానులని ప్రకటించడంతో అమరావతి పరిధిలోని 29 గ్రామాలకు చెందిన రైతులంతా నాలుగున్నర సంవత్సరాలపాటు ఉద్యమించారు. తాజాగా ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో రాజధాని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications