చంద్రబాబు - దత్తపుత్రుడు : అందరూ ఏకమైనా నన్ను ఏమీ పీకలేరు - సీఎం జగన్ సంచలనం..!!
పార్లమెంట్ లోనూ ఎల్లో పార్టీ రాష్ట్ర పరువు తీస్తోందని ముఖ్యమంత్రి జగన్ ఫైర్ అయ్యారు. నంద్యాల సభలో చంద్రబాబు - పవన్ పైన ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. రాస్ట్రంలో జరిగే మంచి.. జగన్ చేసే మంచి కార్యక్రమాలను వారికి కనిపించవని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు తాను చేస్తున్న మంచి చూసి అసూయ..కడుపు మంట పెరిగిపోతున్నాయని విమర్శించారు. ఇలాగే పెరిగితే బీపీ పెరిగి - గుండె పోటు వచ్చి టికెట్ తీసుకుంటారని సీఎం వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష పార్టీలు రాజకీయంగా విభేదించినా రాష్ట్రం కోసం పని చేస్తాయని..కానీ, మన ఎల్లో పార్టీ ..దత్తపుత్రుడు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు.

సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో... ఈ స్థానానికి వచ్చా... వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సీఎం జగన్ సీరియస్ వ్యాఖ్యలు చేసారు. పాలనా సంస్కరణల్లో భాగంగా నంద్యాల కేంద్రంగా తొలి సారి కొత్త జిల్లాలపై హామీ ఇచ్చానని..ఇప్పుడు ఆచరణలోకి తెచ్చానని జగన్ చెప్పారు.
పేదరికం కారణంగా ఏ విద్యార్ధి చదువుకు దూరం కాకూడదనేది తన విధానమని స్పష్టం చేసారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను ఇంగ్లీషు మీడియం స్కూళ్లుగా మార్చేందుకు అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. తల్లులు పిల్లలను చదివించండి...జగన్ మీకు తోడుగా ఉంటాడంటూ అభయమిచ్చారు.

విద్యా వ్యవస్థలో సంస్కరణలు
విద్యా రంగంలో పలు సంస్కరణలు తీసుకొచ్చామని చెప్పారు. నాడు -నేడు ద్వారా విద్యా సంస్థల రూపు రేఖలు మార్చుతున్నామని వివరించారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలతో వస్తున్నారని చెప్పుకొచ్చారు. రాబోయే తరాల అవసరాలు..వారికి అవకాశాలను పరిగణలోకి తీసుకొని బోధనా విధానంలో మార్పులు తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కాలేజీలు రానున్నాయని పేర్కొన్నారు. పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటుగా.. వసతి దీవెన ద్వారా అండగా నిలుస్తున్నామని చెప్పారు. బైలింగువల్ బుక్స్ ద్వారా క్రమక్రమంగా ఆంగ్ల మాధ్యమం వైపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నామని తెలిపారు సీఎం జగన్.
వసతి దీవెన నిధులు విడుదల
తల్లులు బాగుంటేనే.. పిల్లలూ బాగుంటారన్న ఉద్దేశంతో ఖర్చుకు కూడా వెనకాడకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. గత ప్రభుత్వం నీరుగారిస్తే.. తమ ప్రభుత్వం ఇప్పుడు సంక్షేమ పథకం ద్వారా మరింత మెరుగులు దిద్దామని తెలిపారు.
విద్యాసంస్థల్లో వసతులు సైతం మెరుగుపడతాయని, బాగోలేకపోతే ప్రభుత్వం దృష్టికి ఆ తల్లులు తీసుకురావొచ్చని, అవసరమైన చర్యలు తీసుకుంటామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. చదువుతో పాటు మంచి భోజనాన్ని సైతం పిల్లలకు అందించడం గర్వంగా ఉందని సీఎం జగన్ అన్నారు. జగనన్న వసతి దీవెన రెండో విడత కింద రూ 1,024 కోట్లు సీఎం జగన్ విడుదల చేసారు.












Click it and Unblock the Notifications